2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించడం అసాధ్యం

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత వల్ల ప్రయోజనం ఉండదని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఐక్యత అస్థిరమైనదని, సైద్ధాంతికపరంగా భిన్నమైనదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర వల్ల ప్రయోజనాలను కూడా ఆయన ప్రశ్నించారు.

ఓ టీవీ చానల్‌కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ, 2024లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత పనిచేయదని జోస్యం చెప్పారు. సైద్ధాంతిక వైరుధ్యాలతో అది అస్థిరంగా ఉంటుందని, కేవలం పార్టీలు లేదా నేతలను ఏకతాటిపైకి తీసుకురావడం వల్ల విపక్షాల ఐక్యత సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.

 బీజేపీని సవాల్ చేయాలనుకుంటే, దాని బలాలేమిటో ముందుగా అర్థం చేసుకోవాలని హితవు చెప్పారు.  హిందుత్వం, జాతీయవాదం, సంక్షేమం బీజేపీ బలాలని వివరించారు. అది మూడు అంచెల స్తంభమని చెప్పారు. ఈ మూడింటిలో కనీసం రెండిటిని అధిగమించలేకపోతే, మీరు బీజేపీని సవాల్ చేయలేరని ఆయన తేల్చి చెప్పారు.

‘హిందుత్వం, జాతీయవాదం, సంక్షేమం.. ఈ మూడు బీజేపీకి మూల స్తంభాలు.. ఈ మూడింటిలో కనీసం రెండింటిని ఎదుర్కోలేకపోతే.. కమల దళాన్ని వచ్చే ఎన్నికల్లో సవాల్‌ చేయలేరు.. బీజేపీ హిందూత్వ భావజాలంపై పైచేయి సాధించాలంటే.. గాంధేయులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అంబేడ్కర్‌వాదులు ఇలా అన్ని భావజాలాల నేతలు కలిసి రావాలి.. అంతవరకు వారిని ఓడించే అవకాశం లేదు. అయితే, కేవలం భావజాలాన్నే గుడ్డిగా నమ్ముకోకూడదు’ అని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు.

సిద్ధాంతం చాలా ముఖ్యమైనదని, అయితే సిద్ధాంతం ప్రాతిపదికపై గుడ్డి నమ్మకంతో ఉండకూడదని తెలిపారు. ‘‘ప్రతిపక్ష పార్టీలు లేదా నాయకులు కలుసుకోవడం మీడియాలో చూస్తున్నారు.. ఎవరు ఎవరితో కలిసి లంచ్ చేస్తున్నారు, ఎవరిని టీకి పిలుస్తారు…అది సైద్ధాంతిక కలయిక మాత్రమే.. దీని వల్ల సైద్ధాంతిక సమీకరణ జరగదు.. బీజేపీని ఓడించే అవకాశం లేదు’’ అని చెప్పారు