మారువేషాల్లో తప్పించుకు తిరుగుతున్న అమృత్‌పాల్‌‌ సింగ్

ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‍పాల్ సింగ్ పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. అతను వివిధ వేషధారణల్లో తిరుగుతున్నట్టు పంజాబ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మేరకు వివిధ వేషధారణల్లో ఉన్న అమృత్‌పాల్‌ ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.

అంతేగాక, ఈ ఫొటోలో వ్యక్తిని పోలినట్లుగా ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పంజాబ్‌ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిందితుడి అరెస్ట్‌కు సహకరించాలని కోరారు. కాగా, అమృత్‌పాల్‌ సింగ్‌ గత శనివారం పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు.

అమృత్‌పాల్‌ అరెస్ట్‌కు సెర్చింగ్‌ కొనసాగుతున్నదని పంజాబ్‌ ఐజీపీ సుఖ్‌చైన్‌ సింగ్‌ గిల్‌ చెప్పారు. ఇప్పటివరకు అమృత్‌పాల్‌కు సంబంధించిన 114 మంది అనుచరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గాలింపులు ముమ్మరం చేసిన మొదటి రోజు అంటే శనివారం 78 మందిని, ఆదివారం 36 మందిని అదుపులోకి తీసుకున్నారు.

బ్రీజా కారులో అతను ఓ టోల్‌ప్లాజా నుంచి త‌ప్పించుకున్న‌ట్లు కొన్ని వీడియోలు లీక‌య్యాయి. అమృత్‌పాల్ సింగ్ పారిపోయిన కారును సీజ్ చేసిన‌ట్లు ఐజీ సుఖ్‌చైన్ సింగ్ గిల్ తెలిపారు. న‌లుగురు వ్య‌క్తులు అత‌నికి స‌హ‌క‌రించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఆ న‌లుగురిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదుచేసిన్నట్లు తెప్పారు.

కారులో నుంచి పారిపోయిన అమృత్‌పాల్‌.. జ‌లంధ‌ర్ జిల్లాలోని నాన్‌గ‌ల్ అంబియ‌న్ గ్రామంలో ఉన్న గురుద్వారాను సందర్శించినట్లు చేసిన‌ట్లుతెలుస్తోంది. అక్క‌డ అత‌ను దుస్తులు మార్చుకుని పారిపోయిన‌ట్లు గుర్తిస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్‌పై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసిన‌ట్లు ఐజీ తెలిపారు. మార్చి 18వ తేదీన నాన్ బెయిల‌బుల్ వారెంట్ కూడా జారీ చేసిన‌ట్లు చెప్పారు.

కాగా, అతనిని అరెస్టు చేసేందుకు పంజాబీ పోలీసులు భారీ ఆప‌రేష‌న్ చేపట్టినా 80 వేల మంది పోలీసుల క‌న్నుగ‌ప్పి ఎలా త‌ప్పించుకున్నాడని పంజాబ్ హైకోర్టు ప్ర‌శ్నించింది. ఆ ఆప‌రేష‌న్‌పై నివేదిక ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరింది.  రాష్ట్ర పోలీసుల ఇంటెలిజెన్స్ విఫ‌ల‌మైన‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది.

ఇలా ఉండగా, అమృత్‌పాల్ సింగ్ కారును వదిలి పంజాబ్ సరిహద్దులను దాటి పారిపోయాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. నేపాల్ చేరుకుని అక్కడనుంచి కెనడాకు సింగ్ పారిపోయే అవకాశముందని వర్గాలు పేర్కొన్నాయి. కాగా సిక్కులకు ప్రత్యేక దేశం కోరుతూ చేపట్టిన ఖలిస్థాన్ ఉద్యమానికి గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ సహకరిస్తోందని వర్గాలు అంచనా వేస్తున్నాయి.