రూ 10 కోట్లు డిమాండ్ చేస్తూ గడ్కరీకి బెదిరింపు

మ‌హారాష్ట్ర‌లోని నాగ‌పూర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కార్యాల‌యానికి గుర్తుతెలియ‌ని వ్య‌క్తి నుంచి బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. ఖ‌మ్లా ప్రాంతంలోని గ‌డ్క‌రీ ప్ర‌జా సంబంధాల కార్యాల‌య ల్యాండ్‌లైన్ నెంబ‌ర్‌కు అజ్ఞాత వ్య‌క్తి కాల్ చేసి రూ. 10 కోట్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు.

కాగా ఈ ఏడాది జ‌న‌వ‌రిలో నితిన్ గ‌డ్క‌రీ నివాసానికి బెదిరింపు కాల్స్ చేసిన వ్య‌క్తి తాను దావూద్ ఇబ్ర‌హీం గ్యాంగ్ స‌భ్యుడిన‌ని చెబుతూ రూ. 100 కోట్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. గ‌డ్క‌రీ పీఆర్ కార్యాల‌యానికి జ‌న‌వ‌రి 14న మూడు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి.

అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు మంత్రి నివాసంతో పాటు కార్యాల‌యం వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు కాల‌ర్‌ను జ‌యేష్ పూజారిగా గుర్తించారు. త‌న డిమాండ్ నెర‌వేర్చ‌కుంటే బాంబుతో మంత్రికి హాని త‌ల‌పెడ‌తాన‌ని అత‌డు బెదిరించాడు.

జ‌యేష్ పూజారి హింద‌ల్గ జైలు ఖైదీ అని, గ‌తంలో ఓ హ‌త్య కేసులో కోర్టు అత‌డికి మ‌ర‌ణ శిక్ష విధించింద‌ని ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. మ‌రోవైపు గ‌డ్క‌రీపై సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ పెడుతున్న వ్య‌క్తిపై నాగ‌పూర్ పోలీసులు కేసు న‌మోదు చేశారు.