దేశానికి ఐకాన్ గా టీటీడీ మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్ట్

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మాను స్క్రిప్ట్స్ ప్రాజెక్టు దేశానికే ఐకాన్ గా తయారు కావాలని, ఇక్కడ స్కాన్ చేసి భద్రపరచిన మానుస్క్రిప్ట్స్ పై పిహెచ్ డి లు చేసే స్థాయికి తీసుకుని రావాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సూచించారు. మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు ప్రగతిపై సోమవారం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
 
ప్రాజెక్టు ప్రగతిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ పురావస్తు శాఖ నుంచి తెచ్చిన సుమారు 5500 తాళపత్ర గ్రంధాల్లో ఇప్పటివరకు 3370 తాళపత్ర గ్రంధాలు స్కాన్ చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో 2,11,313 తాళపత్రాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. రెండు నెలల్లో మిగిలిన గ్రంధాలను కూడా స్కాన్ చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారం, సిబ్బందిని ఇస్తామని ఈవో వివరించారు.
 
ప్రస్తుతం రోజుకు ఎన్ని తాళపత్రాలు స్కాన్ చేస్తున్నారు, తాళపత్రం శుభ్రపరచడం నుంచి తైల శోధన, స్కానింగ్ వరకు జరిగే వివిధ ప్రక్రియల గురించి ఈవో తెలుసుకున్నారు. వేదాంతం, పురాణాలు, కావ్యాలు, జ్యోతిష్యం తదితర అంశాలకు సంబంధించిన తాళపత్ర గ్రంధాలు ఉన్నాయని అధికారులు వివరించారు.
ఇవి జాతి సంపద అని, వీటిని జాగ్రత్తగా స్కాన్ చేసి ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా తెలుగులో తర్జుమా చేయాలని ఈవో అధికారులకు సూచించారు. ఇలా తర్జుమా చేసిన వాటిని పుస్తక రూపంలో తేవడానికి ఒక ప్రాజెక్టు తయారు చేసి ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు.
 
ఈ పుస్తకాల ఆధారంగా పి హెచ్ డి చేయడానికి అవసరమైన వాతావరణం కల్పించి పిహెచ్ డి లు ప్రదానం చేసే ఏర్పాటు చేయాలన్నారు. సనాతన జీవన్ ట్రస్టు సహకారంతో టీటీడీ ఆధ్వర్యంలో వేద విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రాజెక్టుకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తేవాలని ఆయన ఆకాంక్షించారు.