వైసీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తుంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ సర్కార్ మాత్రం లెక్కకు మించి అప్పులు చేస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ విమర్శించారు. విశాఖలో మేధావులతో జరిగిన సమావేశంలో కూటమి ఎంపీ అభ్యర్థి భరత్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజులను పరిచయం చేసి మద్దతు కోరారు. 

లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రంలో ప్రతి వ్యక్తి పైన రుణ భారం పెట్టిందని కేంద్ర మంత్రి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసేసి పన్నుల భారం విపరీతంగా ప్రజల మీద వేసిందని ఆరోపించారు. ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసి హింసించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ ప్రభుత్వం విశాఖను ఏపీకి మాదకద్రవ్యాల పంపిణి కేంద్రం​గా మార్చేసిందని రాజ్​నాథ్​​సింగ్ ధ్వజమెత్తారు. ల్యాండ్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా, మైనింగ్ మాఫియాలు ఏపీలో స్వైర విహారం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ అవినీతి ఆరోపణలలో పూర్తిగా కూరుకుపోయిందని విమర్శించారు. 

 
ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అభివృద్ధికి కావలసిన భరోసాను కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని రాజ్ నాథ్ సింగ్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజు త్వరలోనే ఉందని స్పష్టం చేశారు.  కూటమి సర్కార్ రాష్ట్రంలో అభివృద్ధికి కావలసిన భరోసాను కల్పిస్తుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ విస్మరించిన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి తెలుగు వారిపై ఉన్న గౌరవాన్ని ఎన్డీఏ సర్కారు చాటి చెప్పిందని రాజ్ నాథ్ గుర్తు చేశారు.  వచ్చే ఐదేళ్లలో దేశంలో జమిలి ఎన్నికలకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడతామని ప్రకటించారు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.  రాజ్యాంగం అమోదించని మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నించిందని విమర్శించారు. 

మైనారిటీలకు ఎటువంటి వివక్ష లేకుండా అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్​ పలు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. భారతీయ సైన్యంలో కూడా మతప్రాతిపదికన లెక్కలు వేయాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రయత్నించిందని ఎండగట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎటువంటి వివక్ష లేకుండా మైనారిటీలు సమాన అవకాశాలు పొందుతున్న విషయాన్ని కూడా విస్మరించిందని రాజ్ నాధ్ సింగ్ విమర్శించారు.