అనపర్తి బిజెపి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి. పురంధేశ్వరి, రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థిగా రామకృష్ణా రెడ్డి పోటీ చేయనున్నారు.
 
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారు. అయితే, అప్పటికే టిడిపి ఆయనకు ఆ సీటును కేటాయించడంతో ఆయన ప్రచారం కూడా ప్రకటించారు. ఈ క్రమంలో తనకు టికెట్ కేటాయించాలని రామకృష్ణారెడ్డి టిడిపి నాయకత్వాన్ని పట్టుబట్టారు. 
 
మరోవంక, ఈ సీటులో బలమైన అభ్యర్థి లేని పక్షంలో రాజమండ్రి లోక్ సభ నుండి పోటీచేస్తున్న పురందేశ్వరి గెలుపొందడం కష్టమని బిజెపి నాయకత్వం భావించింది. అందుకనే ఈ సీటును వదులుకొని, దాని స్థానంలో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి లేదా ఏలూరు జిల్లాలోని దెందులూరు సీటును కేటాయించాలని బిజెపి ప్రతిపాదించింది.
అంతకు ముందు పురందేశ్వరి స్వయంగా రామకృష్ణారెడ్డిని కలిసి బీజేపీలో చేరి, బిజెపి అభ్యర్థిగా పోటీచేయమని కోరినా ఆయన ఒప్పుకోలేదు. అయితే ఆమె నామినేషన్ వేసిన సమయంలో పాల్గొన్నారు.  అయితే, సమీకరణలు కుదరకపోవడంతో చివరకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్ పై అనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ  బీజేపీ తరపున అనపర్తి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. అభ్యర్థులు మారినప్పుడు కొంత మనస్తాపం ఉంటుందని చెబుతూ ఇద్దరు కార్యకర్తలనూ సమన్వయం చేసుకుంటూ నడవాలని ఆమె కోరారు. వారి గౌరవాన్ని పార్టీ దృష్టిలో పెట్టుకుందని ఆమె హామీ ఇచ్చారు.
 
ఇంతకు ముందు అనపర్తి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన శివరామకృంరాజు మాట్లాడుతూ తాను పార్టీ మాటకు కట్టుబడి పనిచేస్తానని చెప్పారు. కార్యకర్తల భావోద్వేగం మధ్య కండువా తీసేశారని, కమలం కండువా తనపైనే ఉందని పేర్కొన్నారు.  పార్టీ నిర్ణయమే శిరోధార్యమని పేర్కొంటూ అనపర్తిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు శివరామకృష్ణంరాజు. బీజేపీ గెలుపు కోసం భవిష్యత్తులో తనకు అప్పజెప్పే బాధ్యత నెరవేరుస్తామని తెలిపారు.