ఏపీ అసెంబ్లీలో వైసిపి, టిడిపి ఎమ్యెల్యేల ఘర్షణ!

ఎపి అసెంబ్లీలో సోమవారం వైసిపి, టిడిపి ఎమ్మెల్యేలు ఘర్ష‌ణ‌కు  దిగడంతో రణరంగాన్ని తలపించింది. పరస్పరం ఘర్షణకు దిగడంతో సభ ప్రారంభమైన కాసేపటికే అసెంబ్లీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభలో పరస్పర దూషణలు చేసుకున్నారు. ఒక ద‌శ‌లో బుచ్చ‌య్య చౌద‌రి కింద‌ప‌డిపోయారు.  ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకునేందుకు య‌త్నించారు.

స‌భ అదుపు త‌ప్ప‌డంతో 11 మంది టిడిపి స‌భ్యుల‌ను స్పీక‌ర్ తమ్మినేని సీతారాం స‌భ నుంచి స‌స్సెండ్ చేసి అసెంబ్లీని వాయిదా వేశారు. వరుసగా ఏడవ రోజున కూడా టిడిపి సభ్యులను సభ నుండి బహిష్కరించి సభాకార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. ఈ ఉదయం సభ ప్రారంభమైన సమయం నుంచి జీవో నెంబర్ 1పైన టీడీపీ నిరసనకు దిగింది.

టిడిపి స‌భ్యులు జివో నెంబ‌ర్ 1 రద్దు కోరుతూ వాయిదా తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టగా, దానిని స్పీక‌ర్ తిర‌స్క‌రించారు.  ఈ సంద‌ర్భంగా టిడిపి స‌భ్యులు ప్ల‌కార్డుల‌తో స్పీక‌ర్ పోడియం వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టారు. పేపర్లు చింపి విసిరేసారు.  దీని పైన మంత్రులు..వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు పాల్గొన్న కందుకూరు..గుంటూరు సభల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట.. మరణాల కారణంగానే ఈ జోవో అవసరమైందని స్పష్టం చేశారు.
 
ఈ స‌మ‌యంలోనే సూళ్లూరుపేట వైసిపి ఎమ్మెల్యే సంజీవయ్య టీడీపీ సభ్యులు బాలాంజ‌య‌నేయులు, బుచ్చియ్య చౌద‌రి వ‌ద్ద‌కు దూసుకువ‌చ్చారు.  వారి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది.  ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకోవటం పైన ఆగ్రహం వ్యక్తంచేస్తూ టీడీపీ సభ్యుల తీరు పైన స్పీకర్ అసహనం వ్యక్తం చేసారు. స్పీకర్ ముఖం కనపడకుండా టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయులు ప్లకార్డు పెట్టటం పైన వైసీపీ సభ్యులు  బీసీ స్పీకర్ ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు.
 
సభ అదుపు త‌ప్ప‌డంతో టిడిపి స‌భ్యుల‌ను సస్పెండ్ చేసిన స్పీక‌ర్ స‌భ‌ను వాయిదా వేశారు. స్పీకర్ సమక్షంలోనే తమ ఎమ్మెల్యేలపై దాడి జరిగిందని, అసెంబ్లీ చరిత్రలో ఇంతకంటే దారుణమైన ఘటనలు ఎప్పుడూ జరగలేదని అంటూ టిడిపి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు.  ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు చీకటి రోజుని, చట్ట సభలకు మచ్చ తెచ్చిన సీఎంగా జగన్ నిలిచిపోతారని ధ్వజమెత్తారు.
 
అయితే, టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయులు స్పీకర్ పై దాడి చేశారని, తాను అడ్డుకోవడానికి వెళ్తే తనపైనా దాడి చేశారని వైసిపి సభ్యులు ఆరోపించారు. సుధాకర్ బాబు కూడా అడ్డుకోబోతే అసయనపైనా దాడి చేశారని పేర్కొంటూ సభాపతిని టీడీపీ అవమానించిందని విమర్శించారు. బీసీ అయిన సభాపతిని కాపాడుకోవడానికి వెళ్లామని.. టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.