పోలవరం వంటి భారీ ప్రాజెక్టులు సరే.. నిర్వాసితులను పట్టించుకోరే!

డా. దాసరి శ్రీనివాసులు, రిటైర్డ్ ఐఎఎస్
 
దేశంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులను అమలు చేయకూడదని కాదు, కానీ స్థానికుల ప్రస్తుత జీవన విధానం, ప్రమాణాల మెరుగుదలకు  వీలైనంత తక్కువగా తక్కువ విఘాతం కలిగే విధంగా ఉండాలి.  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు సంబంధించి పునరావాసం, పునరావాస విధానాలు, పద్ధతులు అనూహ్యమైనవి.  వాస్తవానికి 1980ల నుండి, ప్రధానంగా భారీ నీటిపారుదల ప్రాజెక్టు  పోలవరం విషయంలో తిరోగమనంలో ఉండడం విచారకరం.
 
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 1.2 లక్షల మందిని, వారిలో అత్యధికంగా ఆదివాసీయులు ముప్పు ప్రమాదంతో నేరుగా నిర్వాసితులను చేసింది. సుమారుగా, 10 లక్షల మంది ప్రజలు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభావితమయ్యారు. గత ట్రెండ్‌లను అధ్యయనం చేయడం, ప్రస్తుత విధానాలను సమీక్షించడం, ప్రభావితమైన ప్రజల భవిష్యత్తు అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పర్యావరణాన్ని రక్షించడంకు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.
 
నిజాం కాలంలో, 1925-31లో అమలు చేసిన నిజాం సాగర్ ప్రాజెక్ట్ ద్వారా నిర్వాసితులైన కుటుంబాలకు హృదయపూర్వకంగా, న్యాయమైన పునరావాస సౌకర్యాలు అందించారు.13,000 మందికి పైగా ప్రజలను చక్కగా నిర్మించిన పునరావాస కేంద్రాలకు తరలించారు. వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడానికి నగదు మంజూరుతో పాటు భూమి పరిహారం కోసం భూమిని ఇచ్చారు.
 
1947లో అప్పటి మద్రాస్ ప్రావిన్స్ ప్రారంభించిన తుంగభద్ర డ్యామ్ నిర్మాణం 65 కుగ్రామాల నివాసులను నిర్వాసితులను చేసింది. ప్రాజెక్టు పనులు ప్రారంభానికి ముందే పునరావాస ప్రక్రియ చేపట్టారు. కౌలుదారులతో సహా రైతులందరికీ కమాండ్ ఏరియాలో భూమిని అందించారు. ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇచ్చారు. పునరావాసం తర్వాత జీవన స్థితి మెరుగుపడాలి,  క్షీణించకూడదు అనేది అప్పటి విధానంగా ఉండెడిది.
 
అయితే, స్వాతంత్య్రానంతరం పరిస్థితులు మెరుగు పడకపోగా నిజానికి అవి క్షీణించాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (1957-1969)తో ప్రారంభించి, పునరావాస, పరిహార (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీని ఒక విధంగా పలుచన చేసారు. భూ యజమానులకు వారికి గల విస్తీర్ణం కన్నా తక్కువ నిష్పత్తులలో 12.5 ఎకరాల సీలింగ్ కు లోపడి భూములతో పరిహారం చెల్లించారు.
 
1964లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ప్రారంభంతో, సవరించిన పునరావాస విధానం అనే పేరుతో నిర్వాసితుల ప్రయోజనాలను మరింత తగ్గించారు. పునరావాస కేంద్రాలకు తరలించిన నిర్వాసితులకు రెండెకరాల మాగాణి  భూమి లేదా నాలుగెకరాల మెత్త భూమి ఇచ్చారు. తమ భూములకు దూరమైన వారికి రూ.500 నుంచి రూ.2 వేల వరకు నగదు పరిహారం అందించారు.
 
ఈ ప్రాజెక్టు దశ-II 1978లో ప్రారంభమయ్యే సమయానికి విధానంలో మరింత అధ్వాన్నంగా మార్పు వచ్చింది. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సిఫార్సును అనుసరించి, పునరావాస కేంద్రాల ఆలోచనకు పూర్తిగా స్వస్తి పలికారు. భూమి లేదా ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి గరిష్టంగా రూ. 1,000, రెండూ కోల్పోయిన కుటుంబానికి రూ. 5,000 లోబడి నగదు పరిహారం, ఎక్స్‌గ్రేషియా చెల్లింపు మాత్రమే అందించారు. నిజంగా ఇది చాలా అమానవీయ విధానం!
 
శ్రీశైలం ప్రాజెక్టు (1971-1981) విషయంలోనూ ఇదే పరిస్థితి. ఈ ప్రక్రియలో చెల్లించాల్సిన పరిహారం, చెల్లించిన పరిహారం మధ్య చాలా అంతరం ఉంది. ఈ ప్రక్రియలో వర్గ విబేధం కూడా పాటించారు. పెద్ద, మధ్యతరహా భూ యజమానులు తమకు రావాల్సిన నష్టపరిహారంలో 65 శాతం వరకు పొందగలిగితే, భూమిలేని నిర్వాసితులకు మాత్రం 5 నుంచి 6 శాతం పరిహారం మాత్రమే అందింది.
 
మరికొన్ని ప్రాజెక్టుల విషయంలోనూ అలాగే జరిగింది. మానేర్ డ్యామ్ విషయంలో 3,162 మంది భూమిలేని పేదలకు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా చెల్లించలేదు. సింగూరు ప్రాజెక్టు (1989) కింద భూ నిర్వాసితులకు సుదీర్ఘకాలం అందరి చుట్టూ తిరగాల్సి వచ్చింది. అయినా, అర్హులైన 61 శాతం కుటుంబాలకు పరిహారం అందలేదు. మిగిలిన 39 శాతం మందికి పాక్షిక పరిహారం అందింది.
 
 నిరుత్సాహకరంగా, గతంలో భూములను కలిగి ఉన్న వారు అన్ని ప్రాజెక్టుల కింద గతంలో తాము కలిగి ఉన్న దానిలో కేవలం 30 శాతం మాత్రమే భూములను పొందగలిగారు. ఈ ప్రధాన ప్రాజెక్టులన్నింటిలో చికాకు కలిగించే లక్షణం, ఖర్చుల అంచనాలపై విస్తృతంగా కసరత్తు చేసి రూపొందించినా అనేక అంశాలు అనిశ్చితంగా ఉన్నాయి.
 
దానితో అంచనా వ్యయం, వాటి ద్వారా లభించే ప్రయోజనాలపై అంచనాలు ఊహాగానాలకు,  వివాదాలకు దారి తీసింది. ప్రాజెక్టు అమలు ప్రక్రియను నిర్ణయిస్తున్నప్పుడు అనుసరించిన ఖచ్చితమైన లోపాన్ని ఇది సూచిస్తుంది. పోలవరం డ్యామ్ సైట్‌ను ఎవరు సందర్శించినా, డయాఫ్రమ్ వాల్, స్పిల్‌వేలు, కాంక్రీట్ నిర్మాణాలు మొత్తం డ్యామ్‌ల నిర్మాణంలో అత్యున్నత సాంకేతికత గురించి మాట్లాడుతున్నారు. అయితే, ఆశ్చర్యకరంగా, తాజా సర్వే ప్రకారం, డ్యామ్ భద్రతకు సంబంధించి ఇప్పటివరకు 35 డ్యామ్ వైఫల్యాలను నివేదించారు.
 
డిజైన్లు, ఇతర ఇంజనీరింగ్ పారామితుల మార్పులను నదీ తీర రాష్ట్రాల ప్రమేయం లేకుండా అమలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాల నుండి మళ్లీ మళ్లీ వ్యాజ్యాలకు దారి తీస్తోంది. శబరి, పాలేరు ఉపనదుల విషయంలో బ్యాక్‌ వాటర్‌ ఏ మేరకు విస్తరిస్తుంది అనే సమాచారం ఇంకా రాలేదు.
 
ఇప్పటి వరకు చేపట్టిన పునరావాస చర్యలపై ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. స్థానిక గిరిజనులు, ఇతర ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు శాశ్వత నష్టం జరుగుతుందనేది మూగ ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇప్పటికీ ప్రాజెక్టు ప్రభావిత పొరుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసినందున  భారత సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష ఫలితాలకు లోబడి ఉండవలసి రావడంతో, ఇప్పటివరకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణల కసరత్తు  గురించి ఏమిటి? ప్రజల గొంతు ఇంకా పెద్దగా వినిపించలేదు.