ఆత్మాహుతి దాడులకు సిద్ధం చేస్తున్న అమృత్‌పాల్‌ సింగ్‌!

సినీఫక్కీలో వంద కార్లతో వెంబడించిన పోలీసులకు చిక్కిన్నట్లు చిక్కి తప్పించుకు పోయిన ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ చీఫ్ అమృత్‌పాల్‌ సింగ్‌ డ్రగ్ అడిక్షన్ కేంద్రాలను, ఒక గురుద్వారాను అడ్డం పెట్టుకుని ఆయుధాలను నిల్వ చేయడంతోపాటు ఆత్మాహుతి దాడులకు యువతను సిద్ధం చేస్తున్నారని వెల్లడైంది.
 
అతని కోసం కోసం ముమ్మరంగా గాలిస్తూ జల్లెడ పడుతున్న పంజాబ్ పోలీసుల అధికారులు తాజాగా అమృత్‌పాల్‌సింగ్‌ కార్యకలాపాలపై నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఓ సంచలన నివేదిక రూపొందించారు. గతేడాది దుబాయ్‌ నుంచి తిరిగివచ్చిన ఈ వ్యక్తి అనేకమంది యువకుల మనసుల్లో విషబీజాలు నాటి వారిని మానవ బాంబులుగా మారుస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఉండే ఖలీస్థానీ సానుభూతిపరులు, పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు హతమైనప్పుడు వారిని పోరాటయోధులుగా కీర్తిస్తుండేవాడని చెప్పారు.
 
ఆర్థికంగా అధ్వాన్నమైన దశలో ఉన్న పాకిస్థాన్ తన ప్రజల దృష్టిని మరల్చడానికి భారత్‌లోని అమృతపాల్ సింగ్ వంటి దుండగులను రెచ్చగొట్టేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తోందని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. ఆనంద్‌పూర్ ఖల్సా ఫ్రంట్ పేరుతో అమృత్‌పాల్‌సింగ్‌ సృష్టించిన సంస్థలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు యూనిఫామ్‌లు, జాకెట్లను పోలీసులను చేజిక్కించుకున్నారు.
 
అంతకు ముందు అమృత్‌పాల్‌ సింగ్‌ వాహనంలోనూ ఆయుధాలు లభ్యమయ్యాయి. అమృత్‌సర్‌లోని వారిస్ పంజాబ్ దే ఆఫీసు, గురుద్వారా నిర్వహిస్తున్న అనేక డి-అడిక్షన్ సెంటర్లలో అక్రమంగా ఆయుధాలు నిల్వ చేస్తున్నారని అధికారులు తెలిపారు.
 
డీ-అడిక్షన్ సెంటర్లలో చేరిన యువకులను ‘గన్ కల్చర్’ వైపు మళ్లించి, మానవబాంబులా పనిచేసి పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్‌ను హతమార్చిన ఉగ్రవాది దిలావర్‌ సింగ్‌ మార్గాన్ని ఎంచుకోవడానికి వారిని బ్రెయిన్‌వాష్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల ‘షహీదీ సమాగం’ (స్మారక కార్యక్రమాలు)కి హాజరై.. వారిని అమరవీరులుగా కీర్తిస్తుంటాడని వివరించారు.
 
రాష్ట్రంలోని సరిహద్దులను మూసివేసి రహదారులపై భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వదంతుల వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలను సోమవారం మధ్యాహ్నం వరకు నిలిపివేస్తూ పంజాబ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రధాన నగరాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.
 
అమృత్‌పాల్‌ కాన్వాయ్‌కి చెందినదిగా భావిస్తున్న ఓ కారును జలంధర్‌ జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాళాలు, ఒక వాకీటాకీ, తుపాకీ, డజన్ల కొద్దీ తూటాలు లభ్యమయ్యాయి. వీటిని తమ నాయకుడే కొనుగోలు చేశాడని పోలీసులకు పట్టుబడిన అమృత్‌పాల్‌ అనుచరుడొకరు వెల్లడించాడు. దీంతో అక్రమ ఆయుధాల కోణంలో అమృత్‌పాల్‌, అతని అనుచరులు కొందరిపై పోలీసులు కొత్తగా రెండు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసినట్లు అమృత్‌సర్‌ సీనియర్‌ ఎస్పీ వెల్లడించారు. వీరి నుంచి 12 తుపాకులు, 193 తూటాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
 
అరెస్ట్ చేసిన అనుచరుల్లో కీలకమైన నలుగుర్ని ప్రత్యేక విమానంలో అసోం జైలుకు తరలించారు. 2,500 కిలోమీటర్ల దూరంలోని డిబ్రూగఢ్‌ కేంద్ర కారాగారానికి తరలించడానికి కారణాలు మాత్రం చెప్పడానికి అధికారులు నిరాకరించారు. నలుగురికీ జైల్లో పూర్తి రక్షణ కల్పిస్తామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఢిల్లీలో మీడియాకు తెలిపారు.