చంద్రబాబు ప్ర‌భుత్వంలో స్కిల్డ్‌ క్రిమినల్స్‌ చేసిన అతిపెద్ద స్కామ్‌

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ పేరుతో అతిపెద్ద స్కామ్ జ‌రిగింద‌ని, ఇది స్కిల్డ్ క్రిమినల్స్ చేసిన స్కామ్ అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆరోపించారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్‌పై సోమ‌వారం అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇద‌ని విమర్శించారు.
 
దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలో చంద్రబాబుకు తెలుసని ఎద్దేవా చేశారు.  ముఖ్యమంత్రి బాబు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే ఈ స్కామ్‌ ఊపిరి పోసుకుందని చెప్పారు. వ్యూహం ప్రకారం ముఠాగా ఏర్పడి రూ.371 కోట్లు కొట్టేశార‌ని విమ‌ర్శించారు. లోపాయికారీ ఒప్పందంతో దోపిడీకి పాల్పడ్డార‌ని ధ్వజమెత్తారు.
 
స్కిల్డ్  స్కామ్ లో చంద్రబాబు నాయుడు పాత్రపై ఆధారాలు చూపిస్తామని స్పష్టం చేస్తూ చంద్రబాబు, ఆయన మనుషులు ఓ ముఠాగా ఏర్పడి  ఓ పద్దతి ప్రకారం రూ.371 కోట్లు దోచేశారని సీఎం జగన్ ఆరోపించారు.  ఇంత పెద్ద అవినీతి ఎక్కడా చూడలేదని, దోచుకో, పంచుకో, తినుకో అన్నదే వారి విధానమ‌ని దయ్యబట్టారు.
 
ఈ స్కామ్‌లో చంద్ర‌బాబే ప్ర‌ధాన ముద్దాయి అని శాస‌న స‌భ ద్వారా తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే నిరుద్యోగులు, విద్యార్థుల పేరిట జరిగిన అతిపెద్ద స్కామ్‌ గురించి కొద్ది మాటలు చెప్పాలని అంటూ  ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రజాధనాన్ని దోచేయడంలో బాబు ఎంత చాణిక్యుడో ఈ స్కామ్ ఓ ఊదహరణ అని చెప్పారు.
 
స్కామ్ చేయడం దాని నుంచి తప్పించుకోవడం వరకు  బాబు విజన్ కనిపిస్తుందని జగన్  ఎద్దేవా చేశారు.  రూ.371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారని చెబుతూ ఈ మొత్తాన్ని  షెల్ కంపెనీ ద్వారా మళ్లించారని ఆరోపించారు. విదేశీ లాటరీ తరహాలో స్కామ్ కు పాల్పడ్డారని అంటూ పక్కా స్కిల్ ఉన్న క్రిమినల్ కేసు ఇది అని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఈ స్కామ్ ఏపీలో మెుదలై విదేశాలకు పాకిందని సీఎం జగన్ తెలిపారు. తాను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తే.. చంద్రబాబు బటన్ నొక్కితే తిరిగి ఆయన ఖాతాలోకే సొమ్ము జమ అయ్యిందని సీఎం జగన్ విమర్శించారు.

‘విదేశాల నుంచి షెల్ కంపెనీల ద్వారా తిరిగి సొమ్ము రాష్ట్రానికి వచ్చింది. ముఠాగా ఏర్పడి రూ.371 కోట్లు కొట్టేశారు. చంద్రబాబు ముఠా విజన్ ప్రకారం.. స్కామ్ చేశారు. దోచేసిన డబ్బులను ఎలా జేబులో వేసుకోవాలో బాబుకు బాగా తెలుసు. ఇన్వెస్టిగేషన్ చేస్తే.. ఏం చేయాలో బాబు పక్కాగా ప్లాన్ చేశారు. ఇలా ఒక క్రిమినల్ మాత్రమే చేయగలడు. ప్రాజెక్టు చేపడితే.. పూర్తి చర్చ జరగాలి. కానీ చంద్రబాబు టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టలేదు.’ అని సీఎం జగన్ వివరించారు.

సీమెన్స్ అనే ప్రవేటు సంస్థ రూ.3వేల కోట్లు ఇస్తుందని ప్రచారం చేశారని పేర్కొంటూ  ప్రైవేటు కంపెనీ ఎక్కడైనా.. రూ.3వేల కోట్ల గ్రాంట్ ఇస్తుందా అని జగన్ ప్రశ్నించారు. డీపీఆర్ ను సైతం తయారు చేయించలేదని,  చంద్రబాబు అన్ని నిబంధనలను బేఖాతరు చేశారని విమర్శించారు.
ఈ స్కామ్‌పై జీఎస్టీ, ఇంటలీజెన్సీ, ఈడీ, సీఐడీ ఇలా ఏజెన్సీలు అన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారని సీఎం జ‌గ‌న్ తెలిపారు.