`దొరకునా ఇటువంటి సేవ’ నాట్య కదంబం

మానవ జీవితంలో సమస్యలు సహజమని, అయితే ఇబ్బంది ఎదురైనప్పుడు నిబ్బరంతో అధిగమించడం ముఖ్యమని ప్రముఖ సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూచించారు. లక్ష్యసాధనలో సమస్యల్ని దాటుకుని విజయతీరాలకు చేరాలని ఆయన అభిలాషించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య, ప్రముఖ నాట్య గురువు సౌజన్య శ్రీనివాస్ పర్యవేక్షణలో `దొరకునా ఇటువంటి సేవ’ పేరుతో నాట్య కదంబం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
సౌజన్య శ్రీనివాస్ దగ్గర అనేక సంవత్సరాలు పాటు నృత్య శిక్షణ పొందిన శిష్టా వైష్ణవి చక్కటి నృత్య రీతులను అభినయించి ఆకట్టు కొన్నారు. శిష్టా కృష్ణ కుమార్, మైత్రేయి దంపతుల కుమార్తె అయిన వైష్ణవి లా స్టూడెంట్ గా చదువుకుంటూ నాట్యం లో చక్కటి ప్రావీణ్యం సంపాదించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ నాట్య గురువు పసుమర్తి రామలింగ శాస్త్రి, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ, ఎన్ ఐ జీ ఎల్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్ వి రాఘవేంద్రరావుల సమక్షంలో నాట్య కదంబం జరిగింది.‌
 
పుష్పాంజలి, గిరిరాజసుత, ఎందరో మహానుభావులు వంటి నృత్య రీతులను వైష్ణవి అభినయించారు. నాట్య గురువు సౌజన్య శ్రీనివాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో శాస్త్రీయ సంగీత కృత్య రీతులు పరవళ్ళు తొక్కాయి. చివరలో ప్రదర్శించిన తిలాన నృత్య రీతికి ఆహుతులు జేజేలు పలికారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, సౌజన్య శ్రీనివాస్ దంపతులకు గురుపూజ నిర్వహించారు. ముఖ్య అతిథి త్రివిక్రమ్ శ్రీనివాస్ యువ కళాకారిణి వైష్ణవిని అభినందించారు. ఈ కాలం యువత అనేక అంశాల్లో రాణిస్తున్న తీరు ముచ్చట కలిగిస్తోందని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు
 
వివిధ రంగాల్లో భారతీయ యువత అగ్రస్థానంలో నిలుస్తోందని ఉదాహరించారు. శాస్త్రీయ సంగీత సాహిత్య రంగాల్లో మన యువత రాణించాలని ఆయన సూచించారు. నాట్య గురువుగా తన భార్య సౌజన్య శ్రీనివాస్ అగ్రస్థానంలోకి పురోగమిస్తుందని అభిలాషించారు. ఈ ఒరవడి లో ఏర్పాటైన నాట్యకదంభం నిర్వాహకుల్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ అభినందించారు.