రూ. 100 కోట్ల ముడుపులు, లావాదేవీలపై నేడూ కవిత విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో బీఆర్​ఎస్​  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను దాదాపు 10 గంటల పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం విచారించారు. విచారణ మంగళవారం కూడా సాగనుంది.  14 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. రూ. 100 కోట్ల ముడుపులు, సౌత్​ గ్రూప్​ పాత్రపై ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. అయితే ఆమె చాలా ప్రశ్నలకు మౌనంగా ఉండటమే, తెలియదని చెప్పడమే చేశారని చెబుతున్నారు.

సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలో ఆమెను ఒంటరిగానే విచారించినట్లు తెలిసింది.  అరుణ్​ రామచంద్ర పిళ్లై, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం  మనీశ్​ సిసోడియా, అమిత్ అరోరాలతో కలిపి ఇంటరాగేషన్​ చేసినట్లు కథనాలు వచ్చినప్పటికీ  వాటిని ఈడీ వర్గాలు ధ్రువీకరించలేదు. సాయంత్రం ఒకవైపు ఈడీ హెడ్​ ఆఫీసు లోపల విచారణ జరుగుతుండగా బయట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

కవిత తరఫున సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ముగ్గురు అడ్వకేట్లు ఈడీ ఆఫీసు దగ్గరకు వచ్చారు. వీరిలో అడిషనల్​ అడ్వకేట్​ జనరల్​ రామచందర్​రావు, సీనియర్​ అడ్వకేట్లు సోమ భరత్, గండ్ర మోహనరావు ఉన్నారు. ఆ తర్వాత అర్ధదగంటకు ఇద్దరు డాక్టర్లు కూడా ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. ఇందులో ఓ మహిళా డాక్టర్​ కూడా ఉన్నారు. తర్వాత డాక్టర్ల టీమ్​ బయటకు వచ్చేసింది.

ఈ క్రమంలో ఈడీ ఆఫీసు వద్దకు నాలుగు ఢిల్లీ పోలీస్​ ఎస్కార్ట్​ వాహనాలు చేరుకోవడం, భారీగా పోలీసులు మోహరించడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన బీఆర్​ఎస్ ​కేడర్​లో కనిపించింది. అనంతరం రాత్రి 9.10 గంటలకు ఈడీ ఆఫీసు నుంచి కవిత బయటకు వచ్చారు. ఈ నెల 11న సుమారు ఎనిమిది గంటలపాటు కవితను విచారించిన ఈడీ అధికారులు సోమవారం 10 గంటలకు పైగా ప్రశ్నించారు. ఈ నెల 16న విచారణ రావాలని చెప్పినప్పటికీ.. ఆరోజు ఆమె గైర్హాజరయ్యారు.

మహిళలను ఇంటి వద్దే విచారించాలంటూ సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్​ ఈ నెల 24న విచారణకు వస్తుందని, ఆ తీర్పు తర్వాతే వస్తానని ఆరోజు ఈడీకి లేఖ రాశారు. ఇందుకు అంగీకరించని ఈడ ఈ నెల 20 (సోమవారం) విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇవ్వడంతో కవిత  హాజరయ్యారు.

లిక్కర్ స్కామ్​లో సౌత్ గ్రూప్  పాత్రపై కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. సౌత్ గ్రూప్ లోని సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, మాగుంట రాఘవ, బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై  ఇచ్చిన వాంగ్మూలంపై క్రాస్ ఎగ్జామిన్ చేసినట్లు తెలిసింది.  ఢిల్లీ, హైదరాబాద్ హోటల్స్ లో పాల్గొన్న వీడియో పుటేజ్, బుచ్చిబాబు, పిళ్లై  మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలకు సంబంధించిన స్టేట్​మెంట్ తదితర అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు, రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కూపీ లాగినట్లు తెలిసింది.

కవిత గతంలో సమర్పించిన బ్యాంకు స్టేట్‌మెంట్లలో అనుమానాస్పద ఎంట్రీల గురించి, కవిత నుంచి స్వాధీనపరుచుకున్న మొబైల్‌ ఫోన్‌ డేటా ఆధారంగా కూడా ఈడీ కొన్ని ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. మనీశ్‌సిసోడియాతో ఆమెకున్న రాజకీయ సంబంధాలు, ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జి విజయ్‌ నాయర్‌తో భేటీకి కారణాలపైనా ఈడీ అధికారులు ఆరా తీశారు. హైదరాబాద్‌లో కవిత తన నివాసంలో ఇండో స్పిరిట్‌ యజమాని సమీర్‌ మహేంద్రును కలుసుకున్న సందర్భం గురించి కూడా వారు ప్రశ్నించారు. కవిత ధ్వంసం చేసిన ఫోన్లకు సంబంధించిన సమాచారాన్నీ అడిగినట్లు తెలుస్తోంది.

లావాదేవీలు, ఇండో స్పిరిట్- సౌత్ గ్రూప్  దక్కించుకున్న 9 జోన్ల పై ఆరా తీసినట్లు సమాచారం. ఆ దిశలో కుదిరిన ఒప్పందాలు, అందుకు శరత్ చంద్రారెడ్డి కంపెనీల నుంచి హవాలా రూపంలో మళ్లించిన డబ్బు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ అంశాలపై మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత నుంచి ఈడీ అధికారులు స్టేట్ మెంట్  రికార్డు చేసినట్లు సమాచారం.