సృజనాత్మకత పేరుతో అశ్లీలతను సహించం

సృజనాత్మకత పేరుతో అశ్లీలతను సహించలేమని కేంద్ర సమాచార ప్రసార, మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. నాగ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో పెరుగుతున్న అశ్లీలత, దుర్భాషల గురించి విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశంపై ప్రభుత్వ ఆందోళనను  వ్యక్తం చేశారు.

  “సృజనాత్మకత పేరుతో దుర్భాషలాడటం సహించేది లేదు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో దుర్వినియోగం, అసభ్యకరమైన కంటెంట్‌పై  పెరుగుతున్న ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. దీనికి సంబంధించి నిబంధనలలో ఏవైనా మార్పులు చేయవలసి వస్తే దానిని పరిగణనలోకి తీసుకునేందుకు మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉంది” అని స్పష్టం చేశారు.
 
ఈ ప్లాట్‌ఫారమ్‌లకు సృజనాత్మకతకు స్వేచ్ఛ ఇవ్వబడింది తప్ప అశ్లీలతకు కాదని పేర్కొంటూ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి హెచ్చరించారు. ఇప్పటి వరకు ఉన్న ప్రక్రియ ప్రకారం అందిన ఫిర్యాదులను నిర్మాత మొదటి స్థాయిలో పరిష్కరించాలని, 90 నుండి 92% ఫిర్యాదులను అవసరమైన మార్పులు చేయడం ద్వారా వారు పరిష్కరిస్తారని తెలిపారు.
 
ఫిర్యాదుల పరిష్కారం తదుపరి స్థాయి వారి సంఘం స్థాయిలో ఉంటుందని, ఇక్కడ చాలా ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారని పేర్కొంటూ చివరి స్థాయిలో మాత్రం  అది ప్రభుత్వ స్థాయికి వస్తుందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. అక్కడ నిబంధనల ప్రకారం శాఖాపరమైన కమిటీ స్థాయిలో చర్యలు తీసుకుంటారని వివరించారు.
 
అయితే గత కొన్ని రోజులుగా  ఫిర్యాదులు పెరగడంతో తమ శాఖ చాలా సీరియస్‌గా తీసుకుంటోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఏదైనా మార్పు చేయాల్సిన అవసరం ఉంటే, తాము దానిని తీవ్రంగా పరిగణించడానికి సిద్ధంగా ఉన్నామని అనురాగ్‌ ఠాకూర్‌ స్పష్టం చేశారు.