ప్రభుత్వ పరిశీలనలో… ఎన్నారైలకు ఈ-పోస్టల్ బ్యాలెట్

మంద భీంరెడ్డి
గల్ఫ్ కార్మికుల వ్యవహారాల కార్యకర్త, నిపుణులు
 
◉ విదేశాలలోనే ఉండి తమ ప్రతినిధి ద్వారా ఓటేయించడం (ప్రాక్సీ ఓటింగ్) ప్రతిపాదనను పక్కన పెట్టిన ప్రభుత్వం
 
ప్రవాస భారతీయ ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం (ఈటీబీపీఎస్) ను అమలు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజీజు తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు మంత్రి రాజ్యసభలో జవాబు ఇచ్చారు.
 
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 లోని సెక్షన్ 20-ఎ ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుల కోసం ప్రత్యేక నిబంధనలను ఉన్నాయి. 1960 ఓటరు నమోదు 8ఎ, 8బి నియమాల ప్రకారం  భారతదేశం వెలుపల నివసిస్తున్న భారతీయ పౌరులను ఎన్నారై ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి, వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడానికి వీలు కల్పిస్తాయి.
 
తాజా ఓటర్ల నమోదు ప్రకారం 1 జనవరి 2023 నాటికి 1,15,696 మంది ప్రవాస భారతీయులు ఓవర్సీస్ ఎలక్టర్స్ (ఎన్నారై ఓటర్లు) గా తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
 
ఎన్నారై ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం విధానాన్ని అమలు చేయడానికి ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961 ను సవరించే ప్రతిపాదనను భారత ఎన్నికల సంఘం చేపట్టింది.  ఈ ప్రతిపాదన అమలులో ఎదురయ్యే రవాణా సవాళ్ళను పరిష్కరించేందుకు న్యాయ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది.
 
భారత ఎన్నికల సంఘం సిఫారసు ప్రకారం విదేశాల్లో ఉన్న ఓటర్లు స్వయంగా ఇండియాకు వచ్చి ఓటు వేయడం లేదా విదేశాలలోనే ఉండి తమ ప్రాక్సీ (ప్రతినిధి) ద్వారా ఓటు వేయించడంకు వీలు కల్పించేలా ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం 9 ఆగస్టు 2018 న ప్రవేశపెట్టిన బిల్లును లోక్ సభ ఆమోదించింది.  ఈ బిల్లు రాజ్య సభలో ఆమోదం పొందక ముందే లోక్ సభ రద్దు అయినందున ఈ బిల్లు మురిగిపోయింది.