
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై స్పందిస్తూ తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసిందని చెబుతూ ఆధారాలు ఉన్న వారు ఎవరైనా వాటిని కమిటీకి సమర్పించాలని ఆయన సూచించారు.
న్యాయ వ్యవస్థ ప్రక్రియపై అందరికీ నమ్మకం ఉండాలని చెప్పారు. నిరాధార ఆరోపణలు చేయకూడదని పేర్కొంటూ అవి ఎంతో కాలం నిలబడవని తెలిపారు. ‘‘అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇద్దరు రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేసింది. ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న ఆధారాలను కమిటీకి సమర్పించండి’’ అని చెప్పారు. అదానీ వ్యవహారంపై ఆరోపణలు చేస్తున్న వారికి పరోక్షంగా సూచనలు చేశారు.
అదానీ వివాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ద్వారా సెబీ తెలిపిందని అమిత్ షా వివరించారు. ఈ దర్యాప్తును కొనసాగించాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌పై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆరుగురు నిపుణులతో ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే, నందన్ నీలేకని, జస్టిస్ జే పీ దేవధర్, సోమశేఖర్ సుందరేశన్, ఓం ప్రకాశ్ భట్, కేవీ కామత్ ఉన్నారు.
సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయని అమిత్ షా చెప్పారు. రెండు మినహా మిగతా కేసులన్నీ యూపీఏ ప్రభుత్వ హయాంలో నమోదైనవేనని ఆయన తెలిపారు. దర్యాప్తు సంస్థలు చేస్తున్న దానిపై కోర్టుల్లో సవాలు చేసుకోవచ్చని స్పష్టంచేశారు.
హోమ్ మంత్రిగా తన పదవీకాలం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ దేశంలో అంతర్గత భద్రతా పరిస్థితులు గణనీయంగా మెరుగయ్యాయని అమిత్ షా చెప్పారు. నాలుగు దశాబ్దాలపాటు కాశ్మీర్, ఈశాన్య ప్రాంతం, నక్సలిజం సమస్యలకు పరిష్కారం అంటూ లేకుండా పోయింది, అయితే తొమ్మిదేళ్ల ప్రధాని మోదీ పాలనలో దేశంలో తీవ్రవాదం చాలావరకు అదుపులోకి వచ్చిందని తెలిపారు.
2024లో తిరిగి తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ దేశ స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యేసరికి ప్రపంచంలో అగ్ర దేశంగా భారత్ నిలబడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పార్లమెంట్ లో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభన గురించి ప్రస్తావిస్తూ రెండువైపులా కూర్చొని మాట్లాడుకొంటే సమస్య ఉండదని తెలిపారు. స్పీకర్ ముందు కూర్చుని వారు రెండు అడుగులు ముందుకు వేస్తే, తాము కూడా మరో రెండు అడుగులు ముందుకు వేస్తామని స్పష్టం చేశారు.
అయితే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాల నుండి సంప్రదింపులకు ఎటువంటి ప్రతిపాదనలు లేవని అమిత్ షా విమర్శించారు. మీడియా సమావేశాలు తప్ప సంప్రదింపులకు ముందుకు రావడం లేదని అంటూ పార్లమెంట్ లో చర్చలు నిబంధనల ప్రకారం జరుగుతాయి గాని రోడ్డులపై జరుగుతున్నట్లు కాదని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో పార్లమెంట్ లో మాట్లాడే స్వాతంత్రం లేదని కొత్త నినాదం అందుకున్నారని మండిపడ్డారు. వాస్తవానికి ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందని తెలిపారు.
More Stories
అరుణాచల్ పై ‘జీ20’ సాక్షిగా చైనాకు భారత్ ఝలక్
అరెస్ట్ చేయొద్దన్న కవిత అభ్యర్థనకు `సుప్రీం’ తిరస్కరణ
సావర్కర్ పై రాహుల్ వాఖ్యలపట్ల ఉద్ధవ్ ఆగ్రహం!