పంజాబ్ లో ఖలిస్తాన్ తీవ్రవాది అమృత్ పాల్ సింగ్ అరెస్ట్

పంజాబ్ లో కరడుగట్టిన ఖలిస్తానీ తీవ్రవాది, వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. శనివారం జలంధర్ లోని నకోదర్ సమీపంలోని అదుపులోకి తీసుకున్నారు. అతనితోపాటు మరో పది మంది అతని అనుచరులను  కూడా అదుపులోకి తీసుకొని, వారి నుండి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ కు ముందు రాష్ట్రంలో హైడ్రామా నడిచింది. అమృత్ పాల్ సింగ్ ను 50 వాహనాల్లో వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారని, రహస్య ప్రదేశానికి తరలించారనే వార్తలతో పంజాబ్ లోని ప్రత్యేక వేర్పాటు వాదులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. పోలీసులు సైతం భారీగా మోహరించి చెదరగొడుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం సహితం నిశితంగా పరిశీలిస్తున్నది.

రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఇంటర్నెట్ బంద్ చేశారు. మార్చి 19వ తేదీ ఆదివారం సాయంత్రం వరకు పలు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం బంద్ చేసింది. ఎస్ఎంఎస్ సేవలను సైతం నిలిపివేసింది పంజాబ్ సర్కార్. అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేయటానికి కారణాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

గత నెలలో ఆయుధాలతో బెదిరిస్తూ పోలీస్ బారికేడ్లను ఢీకొట్టి, అమృత్‌సర్ శివారుల్లోని అజ్‌నాలా పోలీస్ స్టేషన్ పరిధిలో అతడు, అతడి  సహచరులు, మద్దతుదారులు పోలీసులతో బాహాబాహికి దిగారు. నిర్బంధంలో ఉన్న  తన అనుచరులను బలవంతంగా తీసుకెళ్లాడు. పోలీసులతో అతడి అనుచరులు తలపడుతున్న వీడియోలు ఇంటర్నెట్‌లో కూడా దర్శనమిచ్చాయి.

ఆ దాడిలో చాలా సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని, అప్పటి నుంచి పరారీలో ఉన్న అమృత్ పాల్ సింగ్, అతని అనుచరులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, రోడ్లపై ఆందోళనలు చేసినా,  తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా కఠిన చర్యలు ఉంటాయని, శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

నటుడు దీప్‌ సిధూ ప్రారంభించిన వారిస్‌ పంజాబ్‌ దే అనే రాడికల్‌ ఆర్గనైజేషన్‌ను ప్రస్తుతం అమృత్‌పాల్‌ కొనసాగిస్తున్నాడు. దీప్‌ సిధూ గత ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అమృత్‌పాల్‌ను ముట్టడించిన నేపథ్యంలో పంజాబ్‌ పోలీసులు ప్రజలకు ట్విటర్‌ ద్వారా ఒక విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడకుండా సహకరించాలని కోరారు. శాంతిభద్రతలను కాపాడేందుకే తాము పనిచేస్తున్నామని, రాష్ట్ర ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని అభ్యర్థించారు.