12 మంది టీడీపీ ఎమ్యెల్యేలు, కోటంరెడ్డి సస్పెన్షన్

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నుండి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల తో పాటు వైస్సార్సీపీ అసమ్మతి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సైతం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం బుధవారం ప్రకటించారు. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి , పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అలాగే మిగిలిన సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

సభను తప్పుదారి పట్టించినందుకు, సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుతగిలినందుకు సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ తెలిపారు. దీంతో స్పీకర్‌కు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. అంతకుముందు కేవలం ఇద్దరు టీడీపీ సభ్యులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును మాత్రమే స్పీకర్ సస్పెండ్ చేశారు.

గవర్నర్ రిసీవింగ్ అంశంపై సభలో చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తనకు అవకాశం కల్పించాలని పదే పదే అడిగారు. సుమారు 40 నిమిషాలకు పైగా సభలో అధికార పార్టీ మంత్రులు, సభ్యులు మాట్లాడుతున్న సమయంలో పయ్యావుల అడ్డుతగిలారు. ఈ క్రమంలో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన లేకుండా తమనెలా సస్పెండ్ చేస్తారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు.

దీంతో అప్పటికప్పుడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మరలా వీరిద్దరిని సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు వినతి చేశారు. అప్పుడు స్పీకర్ మరోసారి ఇద్దరు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. సస్పెండ్ అయిన వారు సభ నుంచి బయటకు వెళ్లాలని కోరినప్పటికీ టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. సభ్యులకు ఎంత సమయం ఇచ్చినా వితండవాదం చేస్తుడటంతో టీడీపీ సభ్యులు 12 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

కాగా, ఉదయం సభ మొదలైనప్పటి నుంచి కోటంరెడ్డి నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. తన నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సభలో పోడియం ముందు నిలబడి నియోజకవర్గ సమస్యలపై స్పీకర్‌కు కోటంరెడ్డి విజ్జప్తి చేశారు.

 
అయితే నమ్మకద్రోహి శ్రీధర్ రెడ్డి అని.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దున వ్యక్తి, జగన్ ఫోటో పెట్టుకుని, ఫ్యాన్ గుర్తుపై గెలిచి మోసం చేశారని మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతోందని మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఈ క్రమంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈ షెషన్ మెత్తానికి సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు.