వివేకా హత్య కేసులో నిజాలు కచ్చితంగా బయటకు రావాలి

తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజాలు కచ్చితంగా బయటకు రావాలని ఆయన కుమార్తె డా. సునీతారెడ్డి డిమాండ్ చేశారు. వివేకానందరెడ్డి నాల్గవ వర్ధంతి సందర్భంగా పులివెందులలో కుటుంబ సభ్యులతో కలసి ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించిన ఆమె తన తండ్రి ని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు.

కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. తనకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి డాక్యుమెంట్లలో రూపంలో సమర్పించానని పేర్కొంటూ ఈ సందర్భంగా కొందరు కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయవలసి వస్తున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

హత్య కేసులో ప్రమేయం ఉందని నమ్ముతున్నందునే వారిపై సీబీఐకి అన్ని విషయాలు చెప్పానని ఆమె వెల్లడించారు. తన తండ్రి హత్యపై గతంలో కొందరు తేలికగా మాట్లాడారని గుర్తు చేస్తూ కడప, కర్నూల్ వంటి  ప్రాంతాల్లో ఇలాంటివి మామూలే కదమ్మా అంటూ చులకన చేసే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తారు.

తన తండ్రి హత్య కేసులో సొంత కుటుంబసభ్యుల మీద ఆరోపణలు చేస్తున్నారని చెబుతూ కేసు విచారణ దశలో ఉందని.. ఈ సమయంలో తాను దీనిపై మాట్లాడబోనని చెప్పారు.  తన తండ్రిని ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలి పెట్టగలను? అని ఆమె ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి విషయంలో తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాలని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే బయటకు రావాలని సునీత పేర్కొన్నారు.

పిల్లలు తప్పు చేస్తే ఖండిస్తామని, అలాగే పెద్దలు తప్పు చేసినా వదిలిపెట్టకూడదని ఆమె చెప్పారు. కడప అరాచకాలు తగ్గాయి అనుకున్నానని, కానీ తన తండ్రి హత్య తర్వాత అరాచకాలు తగ్గలేదని రుజువైందని ఆమె తెలిపారు. తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడితే నేరాలు తగ్గుతాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

దర్యాప్తు సంస్థలు, పోలీసుల విచారణ సక్రమంగా జరిగేలా అంతా సహకరించాలని ఆమె కోరారు. వివేకా హత్య కేసులో ఎంతమంది తనకు తెలియకుండానే సహకరిస్తున్నారని చెబుతూ వారందరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత పులివెందులలోని సొంత ఇంట్లోనే వైఎస్​ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ తరువాతి రోజు, అంటే మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల 15 నిమిషాలకు వివేకా పీఏ కృష్ణారెడ్డి ద్వారా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

ఉదయం 6 గంటల 29 నిమిషాలకు కడప ఎంపీ వైఎస్​ అవినాష్‌రెడ్డి, వైఎస్​ భాస్కర్‌రెడ్డి, వైఎస్​ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డితోపాటు పలువురు వైఎస్సార్​సీపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే గుండెపోటుతో వివేకా చనిపోయారని తొలుత ప్రచారం జరిగింది.
 
 అందుకే మృతదేహానికి కుట్లు వేసి, బ్యాండేజ్ చుట్టి, ఇంట్లోని రక్తపు మరకలు తుడిచేశారని, ఈ వ్యవహారంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి.  ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. నిందితుల చుట్టూనే విచారణ సాగుతోంది. కానీ అసలు హంతకులు ఎవరు అన్న చిక్కుముడి వీడడం లేదు.