సామాజిక పరివర్తన ఐదు కోణాలపై ఆర్ఎస్ఎస్ దృష్టి

రాబోయే నెలల్లో, సామాజిక పరివర్తనకు సంబంధించిన ఐదు కోణాలపై దృష్టి పెట్టాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐదు కోణాలలో సామాజిక సామరస్యం, కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ (భారతీయ) ప్రవర్తన,  పౌర విధి ఉన్నాయి. హర్యానాలోని పానిపట్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ వార్షిక అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఏబీపీఎస్) మూడు రోజుల సమావేశాల ముగింపు సందర్భంగా సమావేశ నిర్ణయాలను సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే మీడియా సమావేశంలో వివరించారు.
 
ఈ విషయంలో, సమాజంలో వివక్షకు వ్యతిరేకంగా గొంతును బలోపేతం చేయడం,  సామరస్యం కోసం నిరంతరం కృషి చేయడం ఈ కార్యాచరణ ప్రణాళిక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అంటరానితనం సమాజానికి అవమానకరమని, దానిని నిర్మూలించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ కట్టుబడి ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తేల్చి చెప్పారు.
 
కాగా, భారతదేశానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు భారతదేశం నుండి మాత్రమే వెలువడాలని దత్తాత్రేయ స్పష్టం చేశారు. వక్రీకరించిన చరిత్రను సరైన చరిత్రతో భర్తీ చేయాలని, తద్వారా దేశప్రజలు తమ వారసత్వంపై గర్వపడతారని తెలిపారు. కళ, సాహిత్యం, సృజనాత్మకత ఇతర వ్యక్తీకరణలు సమకాలీనతను ప్రతిబింబించాలని చెప్పారు. 
 
ప్రస్తుతం ఉన్న జనాభా అసమతుల్యత గురించి ఆర్ఎస్ఎస్ ఆందోళన చెందుతోందని పేర్కొంటూ ఈ సమస్య సుప్రీంకోర్టులో కూడా ప్రస్తావనకు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టి.ఎన్. శేషన్, మహాత్మా గాంధీ కూడా దీని గురించి మాట్లాడారని జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిస్తూ దత్తాత్రేయ చెప్పారు.
 
రాహుల్  వ్యాఖ్యలపై హితవు
 
ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ గాంధీ చేసిన విమర్శలు, భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆయన చేసిన ప్రకటనపై ప్రశ్నకు స్పందిస్తూ అటువంటి సీనియర్ పార్లమెంటేరియన్ మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాలని సర్ కార్యవాహ హితవు చెప్పారు. పైగా దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు క్షమాపణలు కూడా చెప్పని వారికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు.
 
ఆర్‌ఎస్‌ఎస్ హిందూ రాష్ట్ర ఆలోచన భౌగోళిక-రాజకీయ సరిహద్దులతో కూడిన ‘రాష్ట్రం’ అనే భావనకు భిన్నమైన సాంస్కృతిక దేశాన్ని ఊహించిందని ఆయన మరోసారి ధృవీకరించారు. ఈ దృక్కోణం నుండి చూసినప్పుడు, భారతదేశం హిందూ రాష్ట్రమని చెప్పడంలో సందేహం లేదని తేల్చి చెప్పారు.
 
 స్వలింగ వివాహం గురించిన ప్రశ్నపై, వివాహం అనేది స్, పురుషు ల మధ్య జరిగే పవిత్రమైన ఆచారమని సంఘ్ దృఢంగా విశ్వసిస్తోందని దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఎందుకంటే వివాహం ఉద్దేశ్యం సమాజం పట్ల పెద్ద ఆసక్తి అని, శారీరక ఆనందం కాదని తెలిపారు.  భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని చెబుతూ వ్యూహాత్మక,  దౌత్య రంగాలలో దాని ప్రభావం, ప్రతిష్ట మరింతగా పెరుగుతుందని ఆయన తెలిపారు. ఈ తరుణంలో మొత్తం సమాజం ఏకతాటిపైకి వచ్చి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
 
భారత్ ను అడ్డుకుంటున్న శక్తులు
 
భారత్‌లో, విదేశాలలో అనేక శక్తులు ఈ మార్గంలో ముందుకు సాగకుండా భారత్‌ను ఆపాలని కోరుతున్నాయని సర్ కార్యవాహ హెచ్చరించారు. భారతదేశం ప్రపంచ నాయకత్వ మార్గంలో సాహసోపేతమైన అడుగులు వేస్తున్న తరుణంలో భారత్ పురోగతిని అడ్డుకోవాలని చూస్తున్న వారు పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపిచ్చారు.
 
అయితే, ఐక్యంగా, ‘స్వా’ స్ఫూర్తితో, మనం ఈ శక్తులను అసమర్థంగా మారుస్తామని, భారత్ పునరుజ్జీవనానికి నిర్ధారిస్తామని భరోసా వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఏబీపీఎస్ సమావేశంలో దేశంలోని వివిధ ప్రాంతాల (రాష్ట్రాల) ప్రతినిధులు మేధోమథనం చేశారు. శాఖల సంఖ్య 62,000 నుంచి 68,000కు పెరిగినట్లు తొలిరోజు సమావేశంలో వార్షిక నివేదిక సమర్పించారు. వచ్చే ఏడాది నాటికి దీన్ని లక్షకు పెంచాలని ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుంది.
 
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరం
 
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరం 2025 విజయదశమి నుండి ప్రారంభమవుతుంది. అయితే ఈ ప్రాధాన్యత గలిగిన సంవత్సరంకోసం ఎబిపిఎస్ ఎటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించలేదని దత్తాత్రేయ చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, సంఘ్  పాదముద్రను విస్తరించడానికి, సేవా కార్యకలాపాల నాణ్యతను పెంచడానికి సభ ఒక వ్యూహాన్ని రూపొందించినట్లు తెలిపారు.
 
శాఖల స్వయంసేవకులు గ్రామాలు, నివాసాల సామాజిక వాస్తవాలను అధ్యయనం చేస్తారు.  స్థానిక సంఘాలను కలుపుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారు. ఇటువంటి ప్రయోగాలు, ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయని వివరించారు.  శాఖలలో ప్రతి మూడు నెలలకోసారి పరివార్ మిలన్ (కుటుంబ సమ్మేళనం) నిర్వహించాలని కూడా నిర్ణయించారు. విలేకరుల సమావేశంలో  అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్  సునీల్ అంబేకర్, నరేంద్ర ఠాకూర్, అలోక్ కుమార్ కూడా పాల్గొన్నారు.