ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ సినిమా కైవసం చేసుకోవడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత అవార్డుగా భావించే ఆస్కార్‌ను భారతీయ సినిమా గెలువటంతో దేశంలోని అన్ని రంగాల వారు సంతోషం వ్యక్తం చేస్తూ సోమవారం ట్వీట్లు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు జాతీయ నేతలు కూడా ఆస్కార్ ఆనందాన్ని పంచుకున్నారు. పాటను స్వరపరిచిన ఎంఎం కీరవాణి, రచించిన చంద్రబోస్, దర్శకుడు రాజమౌళి సహా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.
భారత్ కు చెందిన ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించటంపై కూడా ప్రధాని మోదీ సహా చాలా మంది నేతలు సంతోషం వ్యక్తం చేశారు. నాటునాటు పాపులారిటీ విశ్వవ్యాప్తమైందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “నిరుపమానం! నాటునాటు పాపులారిటీ విశ్వవ్యాప్తం అయింది. ఈ పాట రానున్న చాలా సంవత్సరాలు గుర్తుండిపోతుంది. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం పొందిన సందర్భంగా ఎంఎం కీరవాణి, చంద్రబోస్ సహా మొత్తం టీమ్‍కు అభినందనలు” అని మోదీ పేర్కొన్నారు.
“బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించిన సందర్భంగా స్వరకర్త కీరవాణి, రచయిత చంద్రబోస్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి, మొత్తం ఆర్ఆర్ఆర్ టీమ్‍కు అభినందనలు” అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. “ఆస్కార్ గెలిచిన సందర్భంగా సంతోషంతో నిండిన అభినందలు తెలుపుతున్నా. గొప్ప టీమ్ వర్క్ చూపిన డైరెక్టర్ రాజమౌళి, కంపోజర్ కీరవాణి, రచయిత చంద్రబోస్‍కు ప్రత్యేకమైన అభినందనలు” అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.
“భారత సినీ రంగంతో పాటు మొత్తం దేశానికే ఇది గర్వించదగ్గ సందర్భం. అద్భుతమైన పాటకు ఆస్కార్ అవార్డు గెలిచిన మొత్తం ఆర్ఆర్ఆర్ టీమ్‍కు కంగ్రాచులేషన్స్” అని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‍ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. “ఎంతో పాపులర్ అయన ‘నాటునాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలవడం.. ప్రపంచ వేదికపై భారతీయ సినిమాకు అద్భుతమైన సందర్భం, దక్కిన గుర్తింపు. ఈ గొప్ప విజయం సాధించినందుకు మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో పాటు ఆర్ఆర్ఆర్ మొత్తం టీమ్‍కు అభినందనలు” అని రక్షణ శాఖ మంత్రి రాజ్‍నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
“2023 ఆస్కార్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు గెలిచి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు చరిత్ర సృష్టించింది. దేశ ప్రజలకు ఇదో అద్భుతమైన రోజు” అని శశథరూర్ ట్వీట్ చేశారు. “బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలిచినందుకు కోట్లాది మంది చేసుకుంటున్న సంబరాల్లో మేం జాయిన్ అవుతున్నాం. ఇండియాకు ఇంత సంతోషం, సంబరం తెచ్చినందుకు ధన్యవాదాలు. ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ మొత్తానికి అభినందనలు” అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు.
“భారత్ ఎప్పటికీ ఒక కల అని భావించేది.. కానీ ఓ వ్యక్తి విజన్, ధైర్యం, పట్టుదలతోనే ఇది సాకారమైంది. ఇప్పుడు కోట్ల మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ బృందంలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ బృందంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. సంగీత ప్రియులను తట్టిలేపిన ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో గౌరవనీయమైన ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ఆయన బృందానికి అభినందనలు చెప్పారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాటకు ఆస్కార్ రావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటిందని కొనియాడారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ గెలుచుకోవడం తెలుగువారిగా గర్వకారణం అని తెలిపారు. ‘నాటునాటు’ గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.
నాటు నాటు గీతం తెలుగు ప్రజల అభిరుచికి నిదర్శనం అన్నారు. తెలుగులోని మట్టి వాసనలను చంద్రబోస్ వెలుగులోకి తెచ్చారని కెసిఆర్ కొనియాడారు. కీరవాణి, చంద్రబోస్ సహా రాజమౌళి బృందానికి సిఎం అభినందనలు తెలిపారు. హాలీవుడ్ కు తీసిపోని విధంగా తెలుగు చిత్రాలు రూపొందదడం గొప్ప విషయం అని కెసిఆర్ పేర్కొన్నారు. తెలుగు సినిమా కీర్తి దిగంతాలకు వ్యాపించిందని ఆయన ప్రశంసలు కురిపించారు. నాటు నాటుకు ఆస్కార్ తెలుగు నేలకే కాదు దేశానికే గర్వకారణమని ప్రశంసించారు.
More Stories
దావోస్ నుండి వట్టిచేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు
అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి రప్పించేందుకు సిద్ధం
ఉబర్, ఓలాలకు కేంద్రం నోటీసులు