రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని పార్లమెంటు వేదికగా అధికార భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా వెంటనే బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఉభయ సభల్లో నినాదాలు చేశారు.
 
భారత్‍లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, పార్లమెంటులో మాట్లాడనీయడం లేదని లండన్‍లో చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు లోక్‍సభ, రాజ్యసభలో డిమాండ్ చేశారు. భారత పార్లమెంటు, ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా విదేశీ గడ్డపై రాహుల్ మాట్లాడారని విమర్శించారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు స్తంభించాయి.

లండన్ వేదికగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ ఖండించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‍నాథ్ సింగ్ పార్లమెంటులో స్పష్టం చేశారు. “పార్లమెంటులో ఓ సభ్యుడైన రాహుల్ గాంధీ లండన్‍లో భారత్ ను కించపరిచారు. సభలోని సభ్యులందరూ ఆయన వ్యాఖ్యలను ఖండించాలి. సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలి” అని రాజ్‍నాథ్ సింగ్ కోరారు.

మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని రాహుల్ విదేశాలను కోరారని మండిపడ్డారు.  ఈ తరుణంలో బీజేపీ ఎంపీలందరూ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు భాజపా మిత్రపక్ష నేతలు కూడా మద్దతు పలికారు.

రాజ్‍నాథ్ సింగ్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు వెల్‍లోకి దూసుకొచ్చారు. ప్రధాని మోదీ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విదేశాల్లో విమర్శలు గుప్పించారని గుర్తుచేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో లోక్‍సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.

రాహుల్ గాంధీ క్షమాణపలు చెప్పాలంటూ రాజ్యసభలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. “ప్రతిపక్షానికి చెందిన ప్రముఖ నేత విదేశాలకు వెళ్లి.. అక్కడ భారత ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారు. భారత దేశ ప్రజలను, పార్లమెంటును ఆయన అవమానించారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్ లో భావప్రకటన స్వేచ్ఛ ఉందని, పార్లమెంటులో ఎంపీలు మాట్లాడవచ్చని పేర్కొంటూ పార్లమెంటుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే అని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. దీంతో రాజ్యసభలో గొడవ జరిగింది. ఆ సభ కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

మరోవైపు సీబీఐ, ఈడీ దాడులు, అదానీ గ్రూప్ అవకతవకలపై కూడా ప్రతిపక్షాలు నిరసన చేశాయి. భారత పార్లమెంటులో ప్రతిపక్షాల సభ్యుల మైక్రోఫోన్లు తరచూ పని చేయడం ఆగిపోతాయని బ్రిటిష్ పార్లమెంటేరియన్లను ఉద్దేశించిన ఇచ్చిన ప్రసంగంలో రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాగే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ ఓ ఇంటర్వ్యూలో విమర్శించారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “పార్లమెంటులో ఎంపీలకు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ లండన్‍లో రాహుల్ గాంధీ చెప్పారు. ఆయనపై సభ స్పీకర్ చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కించపరిచినందుకు రాహుల్‍పై ఓ దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి” అని ఓ న్యూస్ ఏజెన్సీ మాట్లాడుతూ చెప్పారు.