టీఎస్‌పీఎస్సీ లో పేపర్ లీక్ లతో నిరుద్యోగులతో ఆందోళన

సంవత్సరాలు గడుస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఇటీవల వరుసగా నియామక ఉత్తరువులు విడుదల చేస్తుండడంతో కొంతమేరకు ఊరట చెందింది. అయితే ఉద్యోగనీయమకాల కోసం జరుగుతున్న పరీక్షలను సక్రమంగా నిర్వహించడంతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) ఘోరంగా విఫలం కావడంతో ఆందోళన చెందుతున్నారు.
 
ఒకొక్క పేపర్ లీక్ అవుతున్నట్లు వెల్లడి కావడంతో ఒకొక్క పరీక్షా రద్దవుతూ వస్తున్నది. దానితో ఇప్పటికే జరిగిన మొత్తం పరీక్షలను కూడా రద్దుచేస్తారా అనే భయం వారిని వెంటాడుతున్నది. ముఖ్యంగా ఎంతోకాలంగా ఎదురుచూసి వ్రాసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కూడా ఎక్కడ రద్దవుతుందో, రద్దయితే మరెప్పటికీ తిరిగి జరుపుతారో అంటూ ఖంగారు పడుతున్నారు.
 
ఇప్పటికే పలు పరీక్షల పేపర్లు లీక్ కాగా, మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
పరీక్షాకు రెండు రోజుల ముందే పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు.  దీంతో ఈ పరీక్షను కూడా రద్దు చేసే యోచనలో టీఎస్ పీఎస్సీ ఉంది. 837 పోస్టులకు ఎగ్జామ్ జరిగింది. 68 వేల 257 మంది ఈ ఎగ్జామ్ రాశారు.
 
 ఈ కేసులో ఇంకా ఏమేం పేపర్లు లీక్ అయ్యాయో ఇప్పుడే ఏం చెప్పలేమని, ఫోరెన్సిక్ రిపోర్టు తర్వాతే అది తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల లీక్ ఇంటి దొంగల పనే అని తేల్చి  టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశామని పోలీసులుతెలిపారు.
 
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ అని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ అనే వ్యక్తి కలిసి ఈ పని చేశారని తేల్చారు. పాస్ వర్డ్ హ్యాక్ చేసి ఎగ్జామ్ పేపర్స్ ను డౌన్ లోడ్ చేశారని తెలిపారు.  కాగా,  ప్రవీణ్ ను సస్పెండ్ చేయడంతో పాటు రాజశేఖర్ రెడ్డిని టర్మీనెట్ చేస్తున్నట్టు  టీఎస్పీఎస్సీ కార్యదర్శి  జనార్దన్ రెడ్డి ప్రకటించారు.
 
వీరితో పాటు ఇటీవలే టీఎస్పీఎస్సీ పరీక్ష రాసి ఎంపికైన రేణుక అనే గురుకుల్ టీచర్ కూడా ఉన్నారని పోలీసులు  చెప్పారు.  డౌన్ లోడ్ చేసిన పేపర్స్ ను రేణుక ఇంటికి తీసుకెళ్లిందని, ఆ తర్వాత అభ్యర్థులైన గోపాల్ నాయక్, శ్రీను నాయక్ లకు వాట్సాప్ లో వాటిని పంపిందని పోలీసులు తెలిపారు. రేణుక భర్త కూడా డీఆర్డీఏలో టెక్నికల్ విభాగంలోనే పని చేస్తాడని కూడా చెప్పారు.

టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌ కు గురైందంటూ కమిషన్‌ అధికారులు శనివారం బేగంబజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఈ నెల 12, 15, 16వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే. ఈ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన బేగంబజార్‌ పోలీసులు ఆదివారం టాస్క్‌ఫోర్స్‌, సైబర్‌ క్రైమ్‌ పోలీసుల సహకారంతో కమిషన్‌ కార్యాలయాన్ని సందర్శించి పలు ఆధారాలు సేకరించారు.

ఐపీ అడ్ర్‌సలను క్రోడీకరించి వెబ్‌సైట్‌ నుంచి ఏ ఐపీ అడ్రస్‌ ద్వారా ప్రశ్నపత్రాల సమాచారం బయటకు వెళ్లిందనే విషయంపై ఆరా తీశారు. విచారణలో టీఎస్‌పీఎస్సీలో ఉన్నతోద్యోగి వద్ద పనిచేస్తున్న ప్రవీణ్‌ అనే ఉద్యోగి వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు ప్రశ్నపత్రాలను లీక్‌ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది.

వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇతనితోపాటు టీఎస్‌పీఎస్సీకి సాంకేతిక సహకారం అందిస్తున్న టీఎస్‌పీఎస్సీకు చెందిన ఒక ఉద్యోగి పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు విచారించగా వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌, ప్రశ్నపత్రాల లీకేజీ వెనుకాల మరికొందరు వ్యక్తులు ఉన్నట్లుగా తేలింది. విచారణలో రూ.10 లక్షలు చేతులు మారినట్లు తెలుస్తున్నది.