మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత

మాజీ మంత్రి, మాజీ సిబిఐ డైరెక్టర్ కె.విజయరామారావు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విజయరామారావు సీబీఐ డైరెక్టర్‌గా రిటైర్ అయ్యాక చంద్రబాబునాయుడు పిలుపుతో టీడీపీలో చేరారు.

టీడీపీ చేరిన ఆయన 1999లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, సీఎల్పీ నేత జనార్దన్‌రెడ్డిపై ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం చంద్రబాబు కేబినెట్‌లో రోడ్డుభవనాల శాఖామంత్రిగా పని చేశారు. 2004 ఎన్నికల్లో తిరిగి జనార్దన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2009 అసెంబ్లీ ఎన్నికలలో దానం నాగేందర్ చేతిలో ఓడిపోయాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విజయరామారావు టీడీపీకి రాజీనామా చేశారు.

2016లో విజయరామారావు బీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత బీజేపీలో చేరినా రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. జనార్ధనరెడ్డి ఓటమి చెందడంతో ఆ తర్వాత కాంగ్రెస్ లో సీఎల్పీ నేతగా డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాబల్యం పెరిగి, 2004లో ముఖ్యమంత్రి కాగలిగారు.

1999 ఎన్నికల అనంతరం ఆయనకు తన మంత్రివర్గంలో స్థానం కల్పించడం కోసం చంద్రబాబు నాయుడు అదే సామజిక వర్గానికి చెందిన కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వలేక పోయారు. దానితో ఆయన టిడిపిని వదిలి, టిఆర్ఎస్ ను ఏర్పాటు చేసి, రాష్ట్ర విభజనకు కారకులయ్యారు. ప్పట్లో విజయరామారావుకు బదులుగా కేసీఆర్‌‌ను కేబినెట్‌లో తీసుకుని ఉంటే.. పరిణామాలు మరో విధంగా ఉండేవని టీడీపీ అధినేత చంద్రబాబు పలు సందర్బాల్లో చెప్పుకొచ్చారు.

విజయరామారావు వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారంలో జన్మించారు. 1958లో కరీంనగర్‌ ఎస్‌‌ఆర్‌ఆర్‌ కాలేజీలో లెక్చరర్‌‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఐపీఎస్‌గా ఎంపిక అయ్యారు. 1959లో ఐపీఎస్ శిక్షణ పొంది చిత్తూరు ఏఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్ కమిషనర్‌గా పనిచేశారు. సీబీఐ డైరెక్టర్‌గా హవాలా కుంభకోణం, బాబ్రీమసీదు విధ్వంసం, ఇస్రో గూఢచార్యం కేసు, ముంబై బాంబు పేలుళ్ల కేసులో పాటు అనేక కేసులు దర్యాప్తు చేశారు.

అప్పటి ప్రధాని పివి నరసింహారావు, బిజెపి అధినేత ఎల్ కె అద్వానీ వంటి ప్రముఖులను నిందితులుగా పేర్కొంటూ హవాలా కుంభకోణం కేసు ఆయన సారథ్యంలోనే జరిగింది. సర్వీసులో ఉండగానే ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. పదవీవిరమణ పొందిన తర్వాత విజయరామారావు పోలీస్‌ మాన్యువల్‌ రాశారు.

విజయరామారావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజాప్రతినిధిగా విజయరామారావు ప్రజలకు సేవ చేశారని కొనియాడారు. విజయ రామారావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కేసీఆర్ ఆదేశించారు.