ప్రగతి భవన్ కనుసన్నల్లోనే పేపర్ లీకేజీ..బీజేవైఎం బీభత్సం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ దగ్గర బీజేపీ యువమోర్చ కార్యకర్తలు బీభత్సం చేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినట్లే ఇచ్చి.. పేపర్లు లీక్ చేసి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారంటూ యువత భగ్గుమన్నారు.  పరీక్షా పేపర్లను అమ్ముకుంటూ, నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని ఆందోళనకారులు మండిపడ్డారు.

బీజేవైఎం కార్యకర్తలు టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌ను నిరసిస్తూ బీజేపీ శ్రేణుల భారీ ఆందోళనకు దిగాయి. టీఎస్‌పీఎస్ఈ బోర్డును ధ్వంసం చేసేందుకు బీజేవైఎం కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో బీజేవైఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు బీజేవైఎం డిమాండ్‌ చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ బోర్డును పీకేశారు. గేట్లు దూకారు.. ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి పోలీసులు లాక్కెళ్లారు.  మరోవైపు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సైతం టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించింది. కార్యాలయం లోపలకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకుని వారిని స్టేషన్‌కు తరలించారు.

సంవత్సరాల తరబడి కష్టపడి చదువుతుంటే పేపర్లు లీక్ చేసి మోసం చేస్తున్నారన, అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారుస్. పేపర్ లీకేజీలు ప్రగతిభవన్ డైరెక్షన్ లో జరుగుతున్నాయంటూ ఆరోపించారు. ఇంజినీరింగ్ విభాగంలోని టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ లీక్ తరహాలోనే గ్రూప్ వన్, ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్ పేపర్లు కూడా లీక్ చేసి ఉంటారనే అనుమానాలను సైతం వ్యక్తం చేస్తున్నారు.

పరీక్షల పేపర్లును కాపాడుకోకపోతే టీఎస్పీఎస్సీ బోర్డు ఎందుకని ప్రశ్నించారు. ప్రగతి భవన్ కనుసన్నల్లోనే టీఎస్పీఎస్సీలో పేపర్ లీకైందని ఆరోపించారు. ఈ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఆందోళన చేస్తున్న  బీజేపీ విద్యార్థుల సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.   అలాగే ఉస్మానియా వ‌ర్శిటీలో కూడా విద్యార్ధులు నిర‌స‌న ఆందోళ‌న చేపట్టారు.. వ‌ర్శిటీ రోడ్ల‌పై బైఠాయించారు.. ఈ లీకేజ్ ల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు.

కాగా, టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీపై నిరుద్యోగులు రోడ్డెక్కారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని లైబ్రరీ దగ్గర ఆందోళనకు దిగారు. తిండి తిప్పలు మానేసి కష్టపడి చదివినా తమకు ఉద్యోగం రాలేదని..అలాంటి ప్రవీణ్ కు వందకు పైగా మార్కులు రావడమేంటని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 పకడ్బందీగా ఉండే టీఎస్పీఎస్సీ ఆఫీసులో పెన్ డ్రైవ్ ద్వారా పేపర్ కాపీ చేయడం అంత ఆశామాషీ కాదని..ఇది సంస్థలో పనిచేసే ఉద్యోగుల సహకారంతోనే సాధ్యమైందని ఆరోపించారు. నిర్వహణ నిర్లక్ష్యంతోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ జరిగినట్లు ఆరోపిస్తున్నారు . కాగా, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించడంతోపాటు గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్త్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.

గ్రూప్ 1 లీక్ పై కూడా అనుమానాలు

మరోవంక, గ్రూప్ 1 పేపర్ కూడా లీకైనట్లు విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము కూడా లీకేజీతోనే ఫెయిలయ్యామా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది అక్టోబర్ 16న గ్రూప్ 1 పరీక్ష జరిగింది. 2.86 లక్షల మంది గ్రూప్ 1 పరీక్ష రాయగా…1:50 నిష్పత్తిలో 25వేల 50 మంది క్వాలిఫై అయ్యారు.

ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో నిందితుడు ప్రవీణ్ గ్రూప్ 1 పరీక్ష రాశాడనే ప్రచారం సాగుతోంది.   ప్రవీణ్ రాసిన ప్రిలిమినరీలో అతడికి 103 మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్‌ పేపర్‌ను ప్రవీణ్ లీక్‌చేశాడా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. 

ప్రవీణ్‌ రాసిన పేపర్‌తో పాటు అతడికి వచ్చిన కోడ్‌ ప్రశ్నపత్రాన్ని పోలీసులు, టీఎస్‌పీఎస్సీ అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాలు వచ్చిన సర్వర్‌ను సైబర్‌ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పేపర్‌ లీక్‌ అయిందా? లేదా? అనే కోణంలో సైబర్‌ నిపుణులు తనిఖీ చేస్తున్నారు. అసలు ప్రవీణ్‌కి 150కి గానూ 103 మార్కులు వచ్చేంత ప్రతిభా పాటవాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రవీణ్ ఓఎంఆర్ షీట్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫొటో మాత్రం వైరల్ గా మారింది. కేసు విచారణలో భాగంగా ప్రస్తుతం నిందితుల కాంటాక్ట్ లిస్ట్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నిందితుల ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుకా సహా 9 మంది అరెస్ట్ అయ్యారు.