బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌ గా ‘ద ఎలిఫెంట్ విష్పరర్స్‌’

ఆస్కార్ అవార్డుల్లో భారత దేశం నుండి మొట్టమొదటిసారిగా ఒక చిత్రం బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌ విభాగంలో ‘ద ఎలిఫెంట్ విష్పరర్స్‌’ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకున్నది. దీనిని డాక్యుమెంటరీని దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్‌ రూపొందించారు. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ డిస్ట్రిబ్యూట్‌ చేసింది.
 
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్ నుంచి వెళ్లి ఆస్కార్ అవార్డ్ కొట్టిన ఏకైక షార్ట్ ఫిల్మ్ ఇది కావటం విశేషం. మైమరపించే సాంకేతిక విలువలతో, గ్రాఫిక్స్ మాయాజాలంతో కాకుండా అద్భుతమైన కధనంతో, అత్యంత సహజంగా నిర్మించి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన చిత్రం.  ఇందులో గ్రాఫిక్స్ అస్సలు ఉండవు. గిరిజన గూడెంలోని ఓ ఇద్దరు వ్యక్తుల కథ ఇది.
ఏనుగు పిల్లలను పెంచే దంపతులుగా వాళ్లు జీవనం సాగిస్తుంటారు. టీవీలు ఉండవు. మొబైల్ ఫోన్లు ఉండవు. ప్రకృతి ఒడిలో జంతువుల మధ్య జీవినం సాగించే ఓ వృద్ధ దంపతుల కథ ఇది.  ఏనుగులనే పిల్లలుగా భావించి, వాటికి పేర్లు పెట్, చిన్న పిల్లలను పెంచినట్లు పెంచి పెద్ద చేస్తారు. పెద్ద అయిన ఏనుగులను అటవీ అధికారులు తీసుకెళతారు. ఆ సమయంలో వాళ్లు పడే మనోవేదన, పిల్లలు దూరం అవుతున్నారనే బాధ వాళ్లలో కనిపిస్తుంది.

తమిళనాడు రాష్ట్రం ముదుమలైన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని ఓ గిరిజన గూడెం. అడవిలో తప్పిపోయిన ఏనుగు పిల్లలు లేదా ప్రమాదంలో తల్లిచనిపోయిన తర్వాత అనాథగా ఉంటే ఏనుగు పిల్లలను అటవీ అధికారులు వీరికి ఇచ్చి పెంచమంటారు. అందు కోసం కొంత డబ్బు ఇస్తారు. దీని కోసం ఆ గిరిజన గూడెంలో ఎలిఫెంట్ ఫీడింగ్ సెంటర్ కూడా నిర్వహిస్తుంటారు. 

అలా అటవీ అధికారులు ఇచ్చే ఏనుగు పిల్లలను సొంత పిల్లలుగా పెంచుతారు వాళ్లు. దానికి రఘు అనే పేరు పెడతారు. ఉదయం నిద్ర లేపి స్నానం చేయిస్తారు. ఆహారం ఇస్తారు. పాలు పడతారు. ఆటలు ఆడిస్తారు. వ్యాయామం చేయిస్తారు. పండుగలకు ముచ్చటగా అలంకరిస్తారు. పూజలు చేస్తారు. సొంత బిడ్డను సాకినట్లు సాకుతారు ఆ ఏనుగు పిల్లన. ఈ డాక్యుమెంటరీ మొత్తం  చాలా ఫీల్ గుడ్ గా ఉంటుంది. ప్రతిదీ నేచురల్ గా ఉంటుంది.

ఈ డాక్యుమెంటరీ తీయటానికి ది ఎలిఫెంట్ విస్పరర్స్ టీంకు ఐదేళ్లు పట్టింది. చిన్న ఏనుగు పిల్ల నుంచి ఐదేళ్ల వరకు ఎలా పెరిగింది అనేది దగ్గరుండి షూట్ చేశారు డైరెక్టర్ కార్తికీ గొన్సాల్వేస్. ఆమె వయస్సు 37 సంవత్సరాలు మాత్రమే. ఐదేళ్ల పడిన కష్టం తెర మీద స్పష్టంగా కనిపిస్తుంది. డాక్యుమెంటరీ చూస్తున్నంతసేపు మనస్సుకు హత్తుకుంటుంది. మనుషులు – జంతువుల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది? గిరిజన గూడెంలో అటవీ ప్రాంతాల్లోని వ్యక్తులు జంతువులను ఏ విధంగా ప్రేమిస్తారు? అనేది కళ్లకే కాదు. మనస్సుకు హత్తుకునే విధంగా చిత్రీకరించారు ది ఎలిఫెంట్ విస్పరర్స్ బృందం.

చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు అందరికీ ఈ షార్ట్ ఫిల్మ్ ఎంతో కనెక్ట్ అవుతుంది. నెట్ ఫిక్స్ లో రిలీజ్ అయిన ఈ షార్ట్ ఇప్పటికే టాప్ ట్రెండింగ్ లో ఉంది.  భారత దేశం నుండి  ఆస్కార్ అవార్డ్ గెలిచిన బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా గుర్తింపు పొందిన ఈ చిత్రం నిజంగా అపూర్వమైనదనే చెప్పవచ్చు. ఈ అవార్డు కోసం ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌తోపాటు హావ్‌లౌట్‌, హౌ డూ యూ మెజర్‌ ఏ ఇయర్‌?, ద మార్థా మిచెల్‌ ఎఫెక్ట్‌, స్ట్రేంజర్‌ ఎట్‌ ద గేట్‌ డాక్యుమెంటరీలో పోటీపడ్డాయి. అయితే చివరికి ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ను ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారం వరించింది.