బాల్యంలో తండ్రి చేతుల్లో లైంగిక వేధింపులు

బాల్యంలో తండ్రి చేతుల్లో లైంగిక వేధింపులకు గురైనని అంటూ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తమిళనాడు బీజేపీ నేత కుష్బూ సుందర్ వెల్లడించిన దారుణ అనుభవాలు ఒకవంక కలకలం రేపుతుండగానే, తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతీ మలివాల్ సైతం అదే తరహాలో తననూ తండ్రి వేధించినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
చిన్నతనంలో తన తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యానని ఆమె  చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో కమీషన్  నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్వాతి మలివాల్ అవార్డు గ్రహీతల పోరాట కథలు తన సొంత పోరాటాన్ని గుర్తుచేశాయని తెలిపారు. తన తండ్రి కూడా తనపై ‘లైంగిక వేధింపులకు’ ఎలా గురి చేశాడో ఆమె గుర్తుచేసుకున్నారు.
 
తన తండ్రి తనను చాలా కొట్టేవాడని, ఇంటికి రాగానే మంచం కింద దాక్కొనేదాన్నని స్వాతీ మలివాల్ తెలిపారు. అప్పట్లో తనకు చాలా భయంగా ఉండేదని, ఆ సమయంలో ఇలాంటి అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఆడవాళ్లకు ఎలా సాధికారత కల్పించాలా? అని రాత్రంతా ఆలోచించేదాన్నని మలివాల్ గుర్తుచేసుకున్నారు.
 
తండ్రి అడుగుల శబ్ధం వింటేనే భయంతో వణికిపోయేదానినని చెబుతూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ‘నా తండ్రి నన్ను లైంగికంగా వేధించేవాడు. భయంకరంగా కొట్టేవాడు. ఆయనంటే భయంతో వణికిపోయేదాన్ని’ అని ఆమె తెలిపారు. నిజానికి తాను ఆనాడు అనుభవించిన వేధింపులే బాధిత మహిళల తరఫున పోరాడాలన్న నిర్ణయానికి కారణమయ్యాయని ఆమె వివరించారు.

 
2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అయ్యారు. తర్వాత ఆమె పదవీకాలాన్ని పొడిగించారు. మహిళా కమిషన్ ఛీఫ్ గా మారకముందు ఆమె ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సలహాదారుగా పనిచేశారు. స్వాతి మలివాల్ హర్యానా ఆప్ మాజీ అధ్యక్షుడు నవీన్ జైహింద్‌ను వివాహం చేసుకున్నారు. అయితే వీరు 2020లో విడాకులు తీసుకున్నారు.