మూత్రపిండాల సమస్య వల్లే రాజకీయాలకు దూరం 

మూత్రపిండాల సమస్యతో బాధపడుతుండడం వల్లే రాజకీయాలకు దూరమైనట్టు  సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌ వెల్లడించారు. తాను ఆ సమస్యకు చికిత్స పొందుతున్న సమయంలో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానని చెప్పారు.  అయితే, రాజకీయాల్లోకి వస్తే ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుందని, ఎక్కువ కార్యక్రమాలతో బిజీగా ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదని అప్పట్లో డాక్టర్ రాజన్ రవిచంద్రన్ తనకు సలహా ఇచ్చారని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు.

రజినీకాంత్ రాజకీయ ప్రవేశంకోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. అభిమానుల కోరికను అర్థం చేసుకున్న ఆయన తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన కూడా చేశారు. “దేవుడు ఆదేశించాడు.. రాజకీయాల్లోకి వస్తున్నా” అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులు పండుగ చేసుకున్నారు. అయితే, ఇంతలోనే తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని ప్రకటించి అందరికీ సూపర్ స్టార్ షాకిచ్చిన విషయం తెలిసిందే.

చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో గత రాత్రి జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి అతిథిగా పాల్గొంటూ ఆయన ఇప్పుడు అందుకు కారణం తెలిపారు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే తాను రాజకీయాల్లోకి రాలేదని రజనీకాంత్ స్పష్టం చేశారు.

తాను కరోనా సమయంలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా చాలామంది ఇలాంటి సలహానే ఇచ్చినట్టు ఆయన చెప్పారు. అప్పట్లో తాను బహిరంగ సభల్లో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకనే రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు తెలిపారు.  తాను ఈ విషయాలు చెబితే తాను భయపడుతున్నానని అనుకుంటారని, అందుకనే ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.

ఇదే సందర్భంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రజినీకాంత్‌పై కూడా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ‘ఆరోగ్యంగా ఉండాల‌ని రాజ‌కీయాల్లోకి రావొద్ద‌ని ర‌జినీకాంత్‌కు నేను స‌ల‌హా ఇచ్చాను. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాలంటే రాజ‌కీయాలు మాత్ర‌మే మార్గం కాదు. చాలా దారులున్నాయి. అలాగని నేను రాజ‌కీయాల్లోకి వ‌చ్చే వారిని వ్య‌తిరేకించ‌టం లేదు. నిరుత్సాహానికి గురి చేయ‌టం లేదు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకిత భావం ఉంటేనే రాజ‌కీయాల్లోకి రావాలి’ అని సూచించారు.