సీనియర్ సిటిజన్లు, వికలాంగులు ఇంటి నుంచే ఓటేయవచ్చు!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్ల పైబడిన సీనియర్ సిటిజన్లు, వికలాంగులు ఇంటి నుంచే ఓటేయవచ్చని భారత ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల నోటిపికేషన్ వెలువడిన ఐదు రోజుల్లోనే 12డి ఫారమ్ లభిస్తుందని, దాని ద్వారా ఇంటి నుంచే ఓటేయవచ్చని ఆయన తెలిపారు.

‘మొట్టమొదటి సారి 80 ఏళ్లకు పైబడినవారు, వికలాంగులైన ఓటర్లు వారి అభీష్టం మేరకు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. వారి కోసం 12డి ఫారమ్ ఉంటుంది. అది ఎన్నికల ప్రకటన విడుదలైన ఐదు రోజుల్లోనే లభ్యం కాగలదు. కావాలనుకునేవారు ఈ వెసలు బాటును వినియోగించుకోవచ్చు’ అని రాజీవ్ కుమార్ ప్రకటించారు.

ముగ్గురు సభ్యులున్న భారత ఎన్నికల సంఘం ప్రస్తుతం కర్ణాటకలో మూడు రోజుల పర్యటనలో ఉంది. అక్కడ ఏర్పాట్లను సమీక్షిస్తుంది. ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ ప్రస్తుతం బెంగళూరులో పర్యటిస్తున్నారని ఈసిఐ ట్వీట్ చేసింది. 224 సభ్యులుండే కర్నాటక అసెంబ్లీ పదవీ కాలం 2023 మే 24తో ముగియనున్నది. అందుకనే ఈలోపుగానే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని రాజీవ్ కుమార్ తెలిపారు.

అయితే, సీనియర్ సిటిజన్లు, పీడబ్ల్యూడీ ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ స్టేషన్లలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కర్ణాటకలో 80 ఏళ్లు పైబడిన 12.15 లక్షల మంది, వుజకబీజీకీ 5.55 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కర్ణాటకలో 100 ఏళ్ల పైబడిన ఓటర్లు 17,000 మందికి పైగానే ఉన్నట్టు ఆయన ఆయన వివరించారు.

కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికలు 2018 మేలో జరిగాయి. ఎన్నికల అనంతరం జనతాదళ్ (సెక్యులర్), కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  అయితే ఆ తర్వాత పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌, జేడీఎస్ సభ్యులు పలువురు అసెంబ్లీకి రాజీనామా చేయడంతో కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. బీఎస్ యడియూరప్ప సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.

2021 జూలై 26న యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జూలై 28న బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 222 స్థానాలకు గాను బీజేపీ 104 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 78 సీట్లు సాధించింది. జనతా దళ్ (సెక్యులర్) 37 సీట్లు కైవసం చేసుకుంది. కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ చెరో సీటు గెలుచుకున్నాయి. ఒక ఇండిపెండెంట్ సైతం గొలుపొందారు.