9 గంటల పాటు కవిత విచారణ..16న మళ్లీ రావాలన్న ఈడీ

ఢిల్లీ మద్యం కేసులో కీలక నిందితురాలిగా భావిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను శనివారం సుమారు తొమ్మిది గంటలసేపు ఈడీ విచారించింది. ఐదుగురు అధికారుల బృందం ఆమెను విచారించింది.  విచార‌ణ ముగిసిన అనంత‌రం తుగ్ల‌క్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి క‌విత బ‌య‌ల్దేరారు.  అయితే ఈ నెల 16న మ‌ళ్లీ విచార‌ణ‌కు రావాల‌ని క‌విత‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
 
విచారణ సందర్భంగా కవితకు మద్దతుగా ఆమె సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీష్ రావులతో పాటు ఏడుగురు మంత్రులు,  పార్టీ నేతలు, న్యాయ నిపుణుల బృందం కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయల ముడుపులను ఆప్ పార్టీకి ఇచ్చినట్లు సిసోడియా, పిళ్లయ్, బుచ్చిబాబు, మాగుంట రాఘవరెడ్డిలు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించారు.
 
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద కవిత స్టేటమేంట్ ను అధికారులు రికార్డ్ చేశారు. విచారణ సందర్భంగా లిక్కర్ స్కాం గురించి తనకేమి తెలియదని, తాను కుట్రదారుని కాదని ఆమె స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎలాంటి ఆధారాలు ధ్వంసం చేయలేదంటూ ఈడీ ప్రశ్నలకు కవిత సమాదానం ఇచ్చారు.
 
ఆమెను  ప్రశ్నించే సమయంలో అరుణ్ పిళ్లయ్ కూడా అక్కడే ఉన్నారు. గత విచారణలో కవిత బినామీ అంటూ ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును  అధికారులు ప్రస్తావించారు. ఆ తర్వాత తన స్టేట్ మెంట్ ఉపసంహరించుకుంటున్నట్లు పిళ్లై రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పుడు. ఆయన సమక్షంలోనే కవితను ప్రశ్నించడం విశేషం.
 
ప్రధానంగా కవిత ధ్వంసం చేసిన ఫోన్ల గురించి అడిగినట్టు తెలుస్తోంది. గతంలో ఆమె వాడిన ఫోన్లలోని డేటాను కూడా ఈడీ అధికారులు సేకరించి దానిపై ప్రశ్నలు కురిపించినట్టు సమాచారం. మరోవైపు.. ఈ కేసులో విజయ్ నాయర్, సమీర్ చంద్ర, కవితకు మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్‌ను ఆధారంగా చేసుకుని విచారణ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె వాడుతున్న ఫోన్‌ను ఇంటి నుంచి తెప్పించి మరీ అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
 
ప్రధానంగా, ‘‘ఢిల్లీ మద్యం వ్యాపారంతో మీకు సంబంధమేంటి? మద్యం కుంభకోణంలో మీ పాత్ర ఏమిటి? మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై మీ బినామీయా? కాదా? ఈ వ్యాపారంలో మీరు ఎంత మేరకు పెట్టుబడులు పెట్టారు? ఇండో స్పిరిట్‌లో 32.5 శాతం వాటాతోపాటు పెర్నాడ్‌ రికార్డ్‌ పంపిణీదారుగా కూడా మీకు భాగస్వామ్యం ఉందా? సౌత్‌ గ్రూప్‌లో మీ వాటా ఎంత? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?” వంటి ప్రశ్నలు సంధించినట్లు చెబుతున్నారు.
 
అదేవిధంగా,  హవాలా ద్వారా ఢిల్లీకి పంపిన డబ్బులు ఎవరివి? ఢిల్లీ ఒబెరాయ్‌ హోటల్‌లో మద్యం వ్యాపారులు, ఆప్‌ నేతలతో మీరు సమావేశమయ్యారా? అక్కడ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జి విజయ్‌ నాయర్‌లను కలుసుకున్నారా? ఆప్‌తో మీకు ఉన్న రాజకీయ సంబంధాలేమిటి? పంజాబ్‌, గోవా ఎన్నికల్లో ఆప్‌కు నిధుల సహాయం చేశారా? అని కూడా అడిగిన్నట్లు తెలుస్తున్నది.
 
 హైదరాబాద్‌లో కూడా మీ నివాసంలో ఇండో స్పిరిట్‌ యజమాని సమీర్‌ మహేంద్రును కలుసుకున్నారా? లేదా? దాదాపు పది ఫోన్లను ఎందుకు ఽమార్చాల్సి వచ్చింది? లేదా ధ్వంసం చేయాల్సి వచ్చింది? హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌లో అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు తదితరులు విజయ్‌ నాయర్‌తో మీ ప్రేరణతోనే చర్చలు జరిపారా? వంటి ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించినట్లు సమాచారం.