లాలూ కుటుంభంకు రూ 600 కోట్ల అక్రమ సంపద!

రైల్వే ఉద్యోగాలు ఇవ్వడం కోసం భూములు తీసుకున్న కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల ఆస్తులపై నిర్వహించిన సోదాల్లో రూ.600 కోట్ల విలువైన అక్రమ సంపదను గుర్తించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం ప్రకటించింది. లెక్కల్లో చూపించని రూ.1 కోటి నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

లాలూ కుటుంబ సభ్యుల తరపున రియల్ ఎస్టేట్, ఇతర రంగాల్లో పెట్టిన పెట్టుబడులను గుర్తించేందుకు దర్యాప్తు జరుగుతోందని తెలిపింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు బిహార్‌లోని పాట్నా, ఫుల్వరి షరీఫ్, ఢిల్లీ, రాంచీ, ముంబై తదితర చోట్ల సోదాలు నిర్వహించారు.  లాలూ కుమార్తెలు రాగిణి, చంద, హేమలకు సంబంధించిన ఆస్తులపై కూడా దర్యాప్తు నిర్వహించారు. అదేవిధంగా ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అబు డోజానా, అమిత్ కట్యాల్, నవదీప్ సర్దానా, ప్రవీణ్ జైన్‌లకు సంబంధించిన కార్యాలయాల్లో కూడా సోదాలు జరిపారు.

బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ను ఈడీ బృందం శుక్రవారం 11 గంటలపాటు న్యూఢిల్లీలో ప్రశ్నించింది. ఇదే కేసులో లాలూను, ఆయన సతీమణి రబ్రీ దేవిని సీబీఐ ఇటీవల ప్రశ్నించింది. ఈ కేసులో సీబీఐ లాలూ, రబ్రీ, మరో 14 మందిపై ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. భోలా యాదవ్, హృదయానంద్ చౌదరి, ధర్మేంద్ర రాయ్‌లను అరెస్ట్ చేసింది.

లాలూ ప్రసాద్ యాదవ్ 2004-09 మధ్య కాలంలో రైల్వే మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఇండియన్ రైల్వేలోని కొన్ని జోన్లలో గ్రూప్-డీ ఉద్యోగ నియామకాలు జరిగాయి. ఆ ఉద్యోగాలు పొందినవారు తమ భూములను లాలూ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ, ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద కానీ రాశారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.