తేజస్వి యాదవ్‍కు సిబిఐ నోటీసులు

`ఉద్యోగంకు భూమి’ కేసులో మరోసారి విచారణకు రావాలని బిహార్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వి యాదవ్‍కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శనివారం నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని కోరింది. సీబీఐ ఆయనకు నోటిసులు జారీ చేయడం ఇది రెండోసారి.
 
ఇప్పటికే ఈ కేసులో తేజస్వి తల్లిదండ్రులు, బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిలకు సీబీఐ విచారించింది. ఇప్పుడు తేజస్వికి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మార్చి 4వ తేదీన విచారణకు హాజరుకావాలని గత నెలలో తేజస్వి యాదవ్‍కు సీబీఐ సమన్లు జారీ చేసింది. అయితే ఆయన వెళ్లలేదు.
 
దీంతో శనివారం మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే ఈసారి కూడా ఆయన విచారణకు హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. భార్య ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆయన సీబీఐ విచారణకు వెళ్లరని తేజస్వి సన్నిహిత వర్గాలు వర్గాలు తెలిపాయి. గర్భిణిగా ఉన్న తేజస్వి భార్య12 గంటల పాటు ఈడీ సోదాలు నిర్వహించిన సమయంలో స్పృహ తప్పారని, ఆమెను ఆసుపత్రికి తరలించారని సమాచారం.

తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 మధ్య రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ గత సంవత్సరం కేసు నమోదు చేసింది. ఆ కాలంలో ఉద్యోగాలు పొందిన కొందరు అభ్యర్థుల నుంచి లాలూ ప్రసాద్ సంబంధీకులు తక్కువ ధరకే భూములను కొన్నారని సీబీఐ ఆరోపణల్లో ఉంది.

లాలూ ప్రసాద్, రబ్రీ దేవి సహా మరికొందరిని ఈ కేసులో చేర్చింది సీబీఐ. `ఉద్యోగంకు భూమి’ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందన్న ఆరోపణలతో లాలూ ప్రసాద్ యాదవ్ కూతుళ్లు, తేజస్వి యాదవ్ నివాసాలు, వారి అనుచరుల ఇళ్లలో ఎన్‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేసింది.

 ఢిల్లీ, పట్నా, రాంచీ సహా మొత్తంగా 24 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో మొత్తంగా రూ.70 లక్షల నగదు, 1.5 కేజీల బంగారు ఆభరణాలు, 540 గ్రాముల బులియన్ గోల్డ్, 900 అమెరికన్ డాలర్లతో పాటు మరికొంత విదేశీ కరెన్సీని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ  కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవిని సోమవారం పట్నాలో సీబీఐ విచారించింది. అనంతరం మరుసటి రోజే ఢిల్లీలో లాలూను ప్రశ్నించింది. అనంతరం మూడు రోజులకే ఈడీ సోదాలు జరిగాయి.