హైదరాబాద్ కేంద్రంగానే లిక్కర్ స్కామ్.. ఈడీ చేతిలో కవిత చాటింగ్!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలన విషయాలు ఈడీ రిపోర్ట్ ద్వారా బయటపడ్డాయి. ఆప్ లీడర్ మనీష్ సిసోడియాను మార్చి 10వ తేదీ విచారించిన తర్వాత ఆయన రిమాండ్ రిపోర్టులో నమ్మలేని నిజాలను వెలుగులోకి వచ్చాయి.  ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందని, ఐటీసీ కోహినూర్ హోటల్ లోనే చర్చలు జరిగాయని రిపోర్టులో స్పష్టం చేసింది ఈడీ.

సిసోడియా రిమాండ్ రిపోర్టులో పలుమార్లు కల్వకుంట్ల కవిత పేరును అధికారులు ప్రస్తావించారు. మద్యం కుంభకోణం కుట్రలో కవిత భాగస్వామిగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. సౌత్ గ్రూపులో కవితది కీలక పాత్ర అని అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈడీ చేతికి వీళ్ల మధ్య జరిగిన చాటింగ్ దొరికింది. ఈ చాటింగ్‌లో ‘వి’ పేరుతో విజయ్ నాయర్, `మేడమ్’ పేరుతో కవిత, `సమీ’  పేరుతో సమీర్ చాటింగ్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ స్కాం మొత్తం హైదరాబాద్‌లోనే జరిగినట్టు ఈడీ పేర్కొంది. ఐటీసీ కోహినూర్ హోటల్‌లో కుట్ర జరిగినట్టు తేల్చింది.

దినేష్ అరోరాను హైదరాబాద్ పిలిపించిన సౌత్ గ్రూప్ సభ్యులు హోటల్ కేంద్రంగా సమాలోచనలు జరిపినట్టు ఈడీ చెబుతోంది. చర్చల సమయంలో విజయ్ నాయర్, అర్జున్ పాండే, అభిషేక్, ఆడిటర్ బుచ్చిబాబు అందరూ కలిసే ఉన్నారని తెలిపింది.  ఎనిమిది గంటలపాటు వీరి సమావేశం  జరిగిందని సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ రాసుకొచ్చింది.

హైదరాబాద్ కేంద్రంగా సాగిన లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ నుంచి ఆప్ పార్టీకి రూ. 100 కోట్లముడుపులు ముట్టచెప్పినట్లు ఈడీ తేల్చింది. సిసోడియా తరపున విజయ్ నాయర్ ఈ వ్యవహారం నడిపారని, ఈ వ్యవహారంపై కవిత, సిసోడియా మధ్య అవగాహన ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టుకు వివరించారు.

ఎమ్మెల్సీ కవిత తరపున అరుణ్ పిళ్లయ్ ప్రాతినిధ్యం వహించారని, ఇండో స్పిరిట్ కంపెనీలో 65 శాతం వాటా సౌత్ గ్రూప్ దే అని రిపోర్టు ద్వారా కోర్టుకు సమర్పించారు ఈడీ అధికారులు. సౌత్ గ్రూప్ లో కవిత భాగస్వామిగా ఉన్నారని ఆమె పేరును అధికారులు ప్రస్తావించారు.

తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీ ఉంటే ముడుపులు ఇస్తామని కవిత ఆప్ నేతలకు చెప్పారని ఈడీ తెలిపింది. 2021 మార్చిలో విజయ్‌నాయర్‌ను కవిత కలిశారని బుచ్చిబాబు చెప్పారని కస్టడీ రిపోర్ట్‌లో ఈడీ వెల్లడించింది. మాగుంట రాఘవకు 32.5 శాతం, కవితకు 32.5 శాతం, సమీర్ మహేంద్రుకు 35 శాతం ఇండో స్పిరిట్స్‌లో వాటా కుదిరిందని, సౌత్ గ్రూప్ ద్వారా వందకోట్లు ఆప్‌కు చెల్లించారని ఈడీ తెలిపింది.

సౌత్ గ్రూప్ సిండికేట్ లో మాగుంట రాఘవరెడ్డి, విజయ్ నాయర్, బుచ్చిబాబుతో పాటు కల్వకుంట్ల కవిత ఉన్నారని మొదటిసారి సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. లిక్కర్ పాలసీ ద్వారా వచ్చే లాభాల్లో ఆరు శాతం సౌత్ గ్రూప్ కు, ఆరు శాతం ఆప్ పార్టీకి పంచుకుంటూ ఈ డీల్ జరిగిందని సిసోడియా విచారణ తర్వాత వెల్లడించింది ఈడీ.