బీబీసీపై చర్యలు తీసుకోండి.. గుజరాత్‌ అసెంబ్లీలో తీర్మానం

గుజరాత్‌ హింసాకాండకు ప్రధాని నరేంద్ర మోదీయే కారణం అంటూ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించి విడుదల చేసిన డాక్యుమెంటరీ దేశంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. 2002లో జరిగిన ఆ అల్లర్లలో మోదీ హస్తం ఉందంటూ చూపించిన ఆ వీడియోపై దేశంలో తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి.
 
తాజాగా గుజరాత్‌ అసెంబ్లీ ఈ వీడియోపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. డాక్యుమెంటరీ రూపొందించిన బీబీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని పంపింది. ఆ డాక్యుమెంటరీ కేవలం మోదీకి వ్యతిరేకం కాదని, దేశంలోని 135 కోట్ల ప్రజలకు వ్యతిరేకమని గుజరాత్‌ హోం మంత్రి హర్ష్‌ సాంఘ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రధానమంత్రి మోదీ తన జీవితమంతా దేశ సేవకు అంకితం చేశారు. అభివృద్ధి సాధనాన్ని ఆయుధంగా మార్చారు. దేశ వ్యతిరేక అంశాలకు తగిన సమాధానం ఇచ్చారు. భారతదేశాన్ని ప్రపంచ వేదికపై ఉంచడానికి ఆయన చాలా కష్టపడ్డారు” అని ఆయన పేర్కొన్నారు.
 
`మోదీ ఫస్ట్‌ క్వశ్చన్‌’ పేరిట రూపొందించిన రెండు భాగాలుగా ఈ డ్యాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. 59 నిమిషాల నిడివితో బీబీసీ రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో రాజకీయాల్లో నరేంద్ర మోదీ తొలి అడుగులు, సాధారణ కార్యకర్త నుంచి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరును దశలవారీగా చూపించారు.
 
 మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002లో జరిగిన అల్లర్ల గురించి ఈ డాక్యుమెంటరీలో ప్రధానంగా ప్రస్తావించారు.  అయితే గోద్రా అల్లర్లతో ప్రధాని మోదీకి సంబంధం లేదని పలు దర్యాప్తు సంస్థలు స్పష్టం చేశాయి. గుజరాత్‌ హింసాకాండలో మోదీ ప్రమేయం ఉందని చెప్పేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని సుప్రీంకోర్టు సహితం ఆయనను నిర్దోషిగా తీర్పునిచ్చింది.
 
అయినా, దురుద్దేశ్యంగా 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఒక అంతర్జాతీయ కుట్రలో భాగంగా ఈ డాక్యూమెంటరీని ఇప్పుడు తీసుకొచ్చారని విమర్శలు చెలరేగాయి.  ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ భారత్‌లో ప్రసారం కాకుండా చేసిన కేంద్ర ప్రభుత్వం దీనిపై విశ్లేషణ చేసిన వీడియోలను సైతం యూట్యూబ్‌లో బ్లాక్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
 
  దీనిని “వలసవాద మనస్తత్వం” కలిగిన “ప్రచార అస్త్రం”గా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది.  ఐటీ నిబంధనలు 2021 ప్రకారం అత్యవసర అధికారాలు ఉపయోగించి ఈ ఆదేశాలు జారీ చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ అంశంపై చేసిన ట్వీట్లకు సంబంధించిన 50 వరకు లింక్‌లను సైతం నిలిపేవేయాలని ట్విట్టర్‌ను ఆదేశించింది.
 
బీబీసీ రూపొందించిన ఈ డాక్యుమెంటరీపై బ్రిటన్ పార్లమెంట్‌లోనూ చర్చకు వచ్చింది. పాకిస్థాన్‌ మూలాలు ఉన్న ఎంపీ ఇమ్రాన్‌ హుస్సేస్‌ ఈ అంశంపై చర్చకు లేవనెత్తగా గుజరాత్‌ అల్లర్లలో మోదీ పాత్ర ఉందన్న ఆరోపణలతో ఏకీభవించనని  ప్రధాని రిషి సునాక్‌ స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.