చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ మూడవసారి ఏకపక్షంగా ఎన్నికయ్యారు. సెంట్రల్ మిలిటరీ కమీషన్ చైర్మెన్‌గా కూడా ఆయన ఎన్నికయ్యారు. బీజింగ్‌లో జరుగుతున్న 14వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో ఆయన్ను ఏకగ్రీవంగా దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇక చైనా ఉపాధ్యక్షుడిగా హాన్ జంగ్ ఎన్నికయ్యారు.
మూడవ సారి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జీ జిన్‌పింగ్ .. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌గా ఎన్నికైన జావో లెజితో పాటు ఉపాధ్యక్షుడు హాన్ జంగ్ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. 69 ఏళ్ల జీ జిన్‌పింగ్ మరో అయిదేళ్ల పాటు దేశాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆయన చైనీస్ కమ్యూనిస్టు పార్టీ నేతగా నియమితులైన విషయం తెలిసిందే.ఇవాళ జరిగిన సమావేశంలో 2,952 ఓట్లు ఏకగ్రీవంగా జిన్‌పింగ్‌కు పోలయ్యాయి.
వరుసగా ఎన్నికవుతున్న ఆయన పార్టీపై పట్టు పెంచుకుంటున్నారు. ఫలితంగా మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. దేశానికి ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా పనిచేయాలన్న నిబంధనను 2018లో జిన్‌పింగ్ ఎత్తివేశారు. ఫలితంగా ఆయన రిటైర్ అయ్యే వరకు లేదంటే మరణించే వరకు, లేదంటే బహిష్కృతయ్యే వరకు ఆయనే చైనా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంది.
అయితే, చైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఎదురులేని నేతగా ఆయన ఎదిగిన క్రమం ఒక స్ఫూర్తిదాయక చరిత్రగా పరిశీలకులు పేర్కొంటుంటారు. బాల్యంలో రాజరిక సౌకర్యాలను అనుభవించాడు. ఆ తరువాత అత్యంత కఠినమైన పరిస్థితులను కూడా ఎదుర్కొన్నాడు. కొన్ని సంవత్సరాల పాటు అటవీ, గ్రామీణ ప్రాంతాల్లో గడిపాడు. కొండ గుహల్లో నిద్రించాడు.
షీ జిన్ పింగ్ తండ్రి షీ ఝాంగ్జున్ చైనా విప్లవ చరిత్రలో కీలక నాయకుడు. కమ్యూనిస్ట్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. ఉప ప్రధాని బాధ్యతలను కూడా నిర్వర్తించారు. అయితే, అప్పుడు చైనాలో తిరుగులేని నేతగా ఉన్న మావోతో విబేధాలు కారణంగా సాంస్కృతిక విప్లవం సమయంలో జిన్ పింగ్ కుటుంబ సభ్యులు దారుణమైన వేధింపులను ఎదుర్కొన్నారు. మొత్తం కుటుంబం కొన్నేళ్ల పాటు అజ్ఞాతంలో గడిపింది.
ఇవన్నీ నిజానికి జిన్ పింగ్ లో పిరికితనానికి బదులు ధైర్యాన్ని, సమస్యలను ఎదుర్కొనే సాహసాన్ని ఇచ్చాయి. 15 ఏళ్ల వయస్సులో ఇల్లు విడిచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, గ్రామీణ జీవనాన్ని గమనిస్తూ, అక్కడే గడపాలని ఆదేశించారు. దాంతో ఆ చిన్న వయస్సులోనే జిన్ పింగ్ గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. అడవుల్లో గడిపాడు. కొండ గుహల్లో నిద్ర పోయాడు. ఇవన్నీ ఆయనను మరింత రాటుదాల్చాయి.
‘‘చైనాను ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మార్చాలన్నది జిన్ పింగ్ స్వప్నం. ఆ స్వప్నం సాకారం కావాలంటే అధికారంలో ఉండడమొక్కటే మార్గమని ఆయన విశ్వసించారు. కమ్యూనిస్ట్ పార్టీ జిన్ పింగ్ కు దైవంతో సమానం. ఆయనకు వేరే వ్యక్తిగత జీవితం లేదు. పార్టీని, చైనాను బలోపేతం చేయడమే లక్ష్యంగా జీవిస్తున్నారు’’ అని జిన్ పింగ్ జీవితంపై ఒక పుస్తకం రాసిన అల్ఫ్రెడ్ చాన్ వివరించారు.
More Stories
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దోషికి జీవిత ఖైదు
అక్రమ వలసదారులను తిప్పి పంపుతా
90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్