బిఆర్ఎస్ కు మూకుమ్మడి రాజీనామాల కలకలం

ఒక వంక సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉండడంతో ఆందోళనలో ఉండగా, మరోవంక ఎమ్యెల్యేల నుండి ఎమ్యెల్సీ అభ్యర్థుల ఎంపిక పార్టీలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తులు భగ్గుమన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలో పలువురు పార్టీకి రాజీనామాలు ప్రకటించారు.

వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, వనపర్తి ఎంపిపి కిచ్చారెడ్, పెద్దమందడి ఎంపిపి మెగా రెడ్డితో పాటు పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు, మాజీ ఎంపిపి, మాజీ జెడ్పిటిసిలు, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు, సర్పంచులు.. ఇతర ముఖ్య నాయకులు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌ రెడ్డి ప్రకటించారు.

కొన్నాళ్లుగా మంత్రి నిరంజన్‌రెడ్డి వైఖరితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న లోక్‌నాథ్‌ రెడ్డి ఇప్పుడు ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సింగిల్‌విండో అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు తదితరులు కూడా పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేయనున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి వనపర్తిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తమ వంతు కృషి చేశామని ఆయన తెలిపారు.  రాష్ట్రం ఏర్పాటు కాక ముందు నుంచే పరోక్షంగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక వెనుకబడిన వనపర్తి జిల్లాలోని రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎన్నో ఇబ్బందులను భరిస్తూ రాత్రింబవళ్లు పార్టీ ప్రతిష్టత కు బలోపేతానికి అహర్నిశలు శ్రమించామని పేర్కొన్నారు.

తాము చేసిన పనుల వల్ల వనపర్తి నియోజకవర్గంలోని నాయకులకు గుర్తింపు వచ్చింది.. కానీ అహర్నిశలు శ్రమించిన తాము మాత్రం గుర్తింపునకు నోచుకోలేకపోయామనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నా భరించామని చెప్పారు. అయితే ఆత్మాభిమానాలను తాకట్టు పెట్టి అగౌరవపడుతూ ముందుకు సాగలేకపోతున్న తరుణంలో ప్రస్తుతానికి పార్టీ సాధారణ క్రియాశీల సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నామని తెలిపారు. గురువారం రాజీనామాలు కేసీఆర్ కు పంపిస్తామని ప్రకటించారు.

నల్లగొండలో చకిలం రాజీనామా

  మరోవంక బిఆర్ఎస్ లో మొదటినుంచి పనిచేస్తున్న ఉద్యమకారులకు గౌరవం దక్కడంలేదని, తాను 22 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నా రాజకీయంగా సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో రాజీనామా చేస్తున్నానని నల్లగొండ జిల్లా పార్టీ సీనియర్‌ నాయకుడు చకిలం అనిల్‌కుమార్‌ ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలకు, సభలకు తాను పెద్దఎత్తున ఖర్చు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశానని గుర్తు చేశారు.

 2004, 2009 సాధారణ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇస్తానని హామీ ఇచ్చి చివరి నిమిషంలో పొత్తుల పేరుతో వేరే పార్టీకి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. 2014, 2018 ఎన్నికల్లో సైతం అలాగే చేశారని, ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి.. ఆ హామీ కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు ఫ్యాక్స్‌ ద్వారా పంపించానని తెలిపారు.

తాజాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ఎమ్యెల్యేల నుండి ఎమ్యెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇస్తారని ఎదురుచూసి మరొకరిని ఎంపిక చేయడంతో పార్టీకి దూరమవుతున్నట్లు తెలుస్తున్నది.