శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల్లో మరణ మృదంగం

మేడ్చల్ జిల్లా ఫిర్జాధిగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న నిమ్మల రమాదేవి (17) విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదృశ్చికంగా జరిగింది కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలో  ఇంటర్మీడియట్ విద్యపై గుత్తాధిపత్యం వహిస్తున్న శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ కళాశాలలో నెలకొన్న దారుణమైన పరిష్టితులకు ఒక తాజా నిదర్శన మాత్రమే.

 దొంగచాటు దెబ్బలు తీస్తూ పేరొందిన ప్రైవేటు కళాశాలల్లో చాలా వాటిని తమలో విలీనం చేసుకొని, తమకు పోటీ అంటూ లేకుండా చేసుకొని, విద్యాప్రమాణాలను పట్టించుకోకుండా కేవలం ఫలితాలకోసం క్రూరమైన పద్ధతులు అనుసరిస్తూ అనేకమంది విద్యార్థుల అకాలమరణానికి ఇవి నిలయాలుగా మారుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్రలో ఏటా 9 లక్షలమందికి పైగా విద్యార్థులు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తుండగా, ఇందులో 70 శాతం మంది చైతన్య, నారాయణ కళాశాలల నుండి రాస్తున్నారు. కేవలం ఎక్కువ మార్కులు వచ్చేటట్లు చేయడం ద్వారా తల్లిదండ్రుల నుండి భారీగా ఫీజులను గుంజుకోవడం కోసం విద్యార్థులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు.

ఫలితాల కోసం విద్యార్థుల పట్ల అనాగరికంగా ప్రవర్తించడం, బూతులు ప్రయోగించడం, విశ్రాంతి లేకుండా బట్టీపట్టమని వత్తిడులకు గురిచేతుండడం ద్వారా బలవన్మరణాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. 1995 నుండి ఇప్పటిదాకా చైతన్య, నారాయణ కళాశాలల వేధింపుల కారణంగా  సుమారు 1500 మంది పిల్లలు బలవన్మరణాలకు గురయినా యాజమాన్యాలపై, అందుకు బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

తమకున్న ధనబలంతో, కీలక పదవులలో ఉన్నవారితో గల పరిచయాలతో చాలా సంఘటనలు అసలు పోలీసుల వరకు వెళ్లకుండా, వెళ్లినా కేసులు నీరుకారి పోయేవిధంగా చేసుకోగలుగుతున్నారు. చివరకు మీడియా సంస్థలు సహితం వారిచ్చే ప్రకటనలకు కక్కుర్తిపడి అటువంటి సంఘటనలను తక్కువచేసి చూపే ప్రయత్నం చేయడం జరుగుతున్నది.

నారాయణ, చైతన్య కాలేజీల్లో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు? కళాశాలల్లో వసతుల పరిస్థితి ఏమిటి? ఇప్పటి వరకు కాలేజీల్లో ఎంత మంది విద్యార్థులు మృతి చెందారు? తదితర వివరాలతో నివేదిక సమర్పించాలని ఇంటర్‌ బోర్డును హైకోర్టు పలుమార్లు ఆదేశించినా రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికార యంత్రాంగాలు మౌనం పాటిస్తున్నాయి. యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నాయి.

ఒక విధంగా, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ అకృత్యాలకు నేరుగా బాధ్యులు అవుతున్నారు. చట్టాలను ఉల్లంఘిస్తూ విద్యాబోధన ఉంటున్నా, అధ్యాపకులను, విద్యార్థులను ఖైదీల మాదిరిగా చూస్తున్నా, ఎక్కువ ఫలితాలు చూపడం కోసం పరీక్షలలో మూకుమ్మడి కాపీ చేసేవిధంగా చేసుకొంటున్నా ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఒకవిధంగా వారితో కుమ్ముక్కవుతున్నాయి.

హైదరాబాద్‌లోని నారాయణ కళాశాల బాధలు తట్టు-కోలేక గతంలో అదృశ్యమైన ఓ విద్యార్ధిని ‘నారాయణ కాలేజీ పిల్లలను చదువు పేరుతో చంపుతోంది. పిల్లలను కాపాడండి!’ అంటూ లేఖ రాసింది.ఇటువంటి దారుణమైన ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఒక్క సంఘటనలో అయినా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించిన దాఖలాలు లేవు.

ఒక విధంగా ఈ రెండు సంస్థలు పోటీ సంస్థలుగా కనబడుతున్నా పరస్పరం అవగాహనతో వ్యవహరిస్తున్నాయి. అధికార యంత్రాంగాన్ని లొంగదీసుకోవడంలో, అధ్యాపకులను వేధించడంతో సహకరించుకొంటున్నాయి. ఫిర్యాదులు చేసిన తల్లితండ్రులు, అధ్యాపకులనే వేధించే పరిష్టితులు నెలకొన్నాయి.