భారత్-పాకిస్థాన్, భారత్-చైనాకు ఉన్న విభేదాలు ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలు కశ్మీరులో హింసాత్మక చర్యలకు పాల్పడితే, పాక్‌పై భారత దేశం ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఉగ్రవాదులకు మద్దతివ్వడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని, పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సైనిక బల ప్రయోగానికి దిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలు కశ్మీరులో అశాంతిని, హింసను సృష్టించినా; భారత దేశంలో ఉగ్రవాద దాడి జరిగినా మోదీ ప్రభుత్వం పాకిస్థాన్‌పై విరుచుకుపడే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ మేరకు అంతర్జాతీయ పరిస్థితులపై అమెరికా ఇంటెలిజెన్స్ కాంగ్రెస్‌కు (అమెరికా పార్లమెంట్) ఓ నివేదిక సమర్పించింది. అంతర్జాతీయ భద్రతాంశాలపై నేషనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయం ఏటా అమెరికా పార్లమెంటుకు వార్షిక ముప్పు అంచనా నివేదికను సమర్పిస్తుంది. సరిహద్దు వివాదంపై భారత్, చైనా మద్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నప్పటికీ పరిస్థితి పూర్తిగా సద్దుమణగలేదని అమెరికా ఇంటెలిజెన్స్ శాఖ పేర్కొంది.
2020 నాటి గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కొంత మేర ఉద్రిక్త వాతావరణం నెలకొందని తమ నివేదికలో తెలిపింది. సరిహద్దు వద్ద ఇరు దేశాల సైన్యాల మోహరింపుతో ఘర్షణకు అవకాశాలు పెరిగాయని, ఇది అమెరికా ప్రయోజనాలకు ప్రమాదమని అభిప్రాయపడింది. ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాలని కూడా సూచించింది.
ఇక భారత్-పాక్ సంబంధాలపై అమెరికా వర్గాలు మరింత ఆందోళన వ్యక్తం చేశాయి. ఇరు దేశాల మధ్య పరిస్థితి దిగజారే అవకాశాలు ఎక్కువని అభిప్రాయపడ్డాయి. ఇరు దేశాలు సరిహద్దు వెంబడి శాంతి స్థాపనకు మొగ్గు చూపుతున్నప్పటికీ.. పాక్ ఉగ్రవాదులకు మద్దతిస్తున్న కారణంగా మోడీ నేతృత్వంలోని భారత్ దాయాదిపై సైనిక శక్తిని వినియోగించే అవకాశాలు పెరిగాయని పేర్కొంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్, చైనా, భారత దేశంల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉందని, అటువంటి పరిస్థితుల్లో అమెరికా తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడవచ్చునని ఈ నివేదిక పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేటి కాలపు యుద్ధ లక్షణాలను నిర్వచించే యుద్ధమని చెప్తూ, అంతర్జాతీయ నిబంధనలను మార్చడం, పొరుగు దేశాలను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతూ, నిబంధనల ఆధారిత ప్రపంచ పరిస్థితులను మార్చే సామర్థ్యం చైనాకు ఉందని తెలిపింది.
వివాదాస్పద సరిహద్దుల వెంబడి భారత్, చైనా తమ తమ సైన్యాలను పెద్ద ఎత్తున మోహరించిన విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. అణ్వాయుధ సామర్థ్యంగల ఇరు దేశాల మధ్య ఘర్షణ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపింది. దీనివల్ల అమెరికన్లకు, అమెరికా ప్రయోజనాలకు ప్రత్యక్ష ముప్పు ఉండే అవకాశం ఉందని, ఫలితంగా అమెరికా జోక్యం అవసరమవుతుందని పేర్కొంది.
More Stories
అల్లు అర్జున్ కు హైకోర్టులో మధ్యంతర బెయిల్
దేశ ఐక్యతకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్