అరాచక శక్తుల గుప్పిట్లో బందీ రాహుల్

భారత్‌లో ప్రజాస్వామ్యంపైన, ఆర్‌ఎస్‌ఎస్‌పైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలను బిజెపి తీవ్రంగా ఖండించింది. రాహుల్ వ్యాఖ్యలు ఆయన మావోయిస్టు ఆలోచనా విధానంతో పాటు అరాచక శక్తుల గుప్పిట్లో బందీ అయినట్లు స్పష్టంగా కనపడుతోందని మాజీ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.

తన అసత్యాలను, నిరాధార ఆరోపణలను వ్యాప్తిచేయడానికి బ్రిటిష్ పార్లమెంట్‌ను రాహుల్ గాంధీ వేదికగా చేసుకోవడాన్ని ఆయన ఖండించారు. విదేశీ గడ్డపైన భారత ప్రజాస్వామ్యం, రాజకీయ వ్యవస్థ, పార్లమెంట్, న్యాయ వ్యవస్థ, భద్రతాపరమైన అంశాల గురించి రాహుల్ మాట్లాడడం సిగ్గుచేటని ప్రసాద్ ఆరోపించారు.

బ్రిటన్‌కు వెళ్ళి భారత దేశ ప్రజాస్వామ్యం, రాజనీతి, పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, భద్రతలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. అన్ని ప్రజాస్వామిక విధానాలను, రాజకీయ విజ్ఞతను రాహుల్ మరిచిపోయారని ఆయన విమర్శించారు. భారత్‌లో ప్రజాస్వామ్య రక్షణకు యూరప్, అమెరికా జోక్యాన్ని రాహుల్ కోరడం సిగ్గుచేటని ప్రసాద్ ధ్వజమెత్తారు.

‘‘భారత దేశ ప్రజాస్వామ్యం, రాజనీతి, పార్లమెంటు, రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలను అవమానించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారని బీజేపీ తీవ్ర ఆవేదనతో స్పష్టం చేస్తుంది’’ అని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

భారత అంతర్గత వ్యవహారాలలో విదేశీ జోక్యాన్ని సహించరాదన్న భారతీయుల ఏకాభిప్రాయాన్ని కూడా రాహుల్ తోసిపుచ్చారని ఆయన విమర్శించారు. అత్యంత బాధ్యతారాహిత్యంతో రాహుల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖండిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను ముస్లిం బ్రదర్‌హుడ్‌తో పోల్చడాన్ని కూడా ప్రసాద్ తప్పుబట్టారు. ఆరెస్సెస్ జాతీయవాద సంస్థ అని తెలిపారు. తామంతా స్వయంసేవకులమని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ చేసిన విమర్శలను ప్రసాద్ ఖండిస్తూ సమాజానికి, దేశానికి ఆర్‌ఎస్‌ఎస్ ఎంతో సేవ చేస్తోందని ఆయన కొనియాడారు.

రాహుల్ గాంధీ బ్రిటన్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, యూరోపు, అమెరికా దేశాలు భారత దేశం నుంచి వ్యాపార, వాణిజ్యాలను, ఆదాయాన్ని పొందుతున్నాయని, భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ఆ దేశాలు చేయవలసినంత చేయడం లేదని పేర్కొనడం మనదేశంలో పెద్ద దుమారం చెలరేగింది.

గతంలో రక్షణ మంత్రిగా పని చేసిన దివంగత ఏకే ఆంటోనీ అధికారికంగా చైనాపై తెలిపిన వైఖరిని రవిశంకర్ ప్రసాద్ ప్రస్తావించారు. ‘‘సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా చైనాను ఇబ్బంది పెట్టాలని మేం అనుకోవడం లేదు’’ అని ఆంటోనీ గతంలో అన్నారని ప్రసాద్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్‌లో మాట్లాడుతూ, చైనా ముప్పును విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అర్థం చేసుకోవడం లేదని ఆరోపించిన నేపథ్యంలో ప్రసాద్ ఈ ప్రస్తావన చేశారు.