హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల దుమారం

జిహెచ్‌ఎంసిలో మరో నకిలీ బాగోతం వెలుగులోకి వచ్చింది. అంతా పారదర్శకత పేరుతో జిహెచ్‌ఎంసి దాదాపుగా అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లోనే జారీ చేస్తోంది. అయినా జనన, మరణాలకు సంబంధించి సరైన పత్రాలు లేకుండానే వేలాది సర్టిఫికెట్లను జిహెచ్‌ఎంసి జనన, మరణ విభాగం జారీ చేసింది. ఇందులో కంప్యూటర్ ఆపరేటర్లు, ఏఎంసిఎ, ఎంఒహెచ్, ప్రధాన కార్యాలయంలోని కీలక అధికారులు ముఖ్య భూమిక పోషించారు.

దీంతో గుట్టు చప్పుడు కాకుండా 21 నెలల కాలంలో సరైన పత్రాలు లేకుండానే జారీ చేసిన జిహెచ్‌ఎంసి జనన మరణ ధ్రువీకరణ విభాగం ఏకంగా 31,448 సర్టిఫికెట్లను జారీ చేసింది. ఇందులో 27,322 జనన, 4,126 మరణ ధృవీకరణ పత్రాలు ఉన్నాయి. నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు కావడంతో జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే రద్దు చేసిన సర్టిఫికెట్లలో సరైన ఆధారాలు సమర్పించినవి కూడా ఉండడంతో జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు ఈ పరిస్థితిని ఏలా చక్కదిద్దాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

జనన, మరణాలకు సంబంధించి 2020 మార్చి నుంచి 2022 డిసెంబర్ వరకు జిహెచ్‌ఎంసి జారీ చేసిన సర్టిఫికెట్లను ఉన్నతాధికారులు రద్దు చేశారు. ఈ కాలంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. 2020లో కరోనా విజృంభణ కొనసాగడం అదునుగా కొంతమంది బ్రోకర్లు, జిహెచ్‌ఎంసి సిబ్బంది, అధికారులు ఒక్కటై అందినకాడికి దండుకుని ఇష్టారీతిన అతిముఖ్యమైన జనన, మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేశారు.

 జనన, మరణాలకు సరైన ఆధార పత్రాలు లేకపోతే ఈ ధృవీకరణ పత్రాలు పొందాలంటే రెవెన్యూ శాఖలోఆర్‌డిఒ, హైదరాబాద్‌లో అయితే స్పెషల్ మెజిస్ట్రేట్ అధికారి ధృవీకరించిన పత్రాలను పొందుపర్చాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా జిహెచ్‌ఎంసి జనన, మరణాలకు సంబంధించి ధృవీకరణ పత్రాలను జారీ చేస్తోంది. అయితే ఇవేమి లేకుండానే జిహెచ్‌ఎంసి అధికారగణం 21,745 జనన, 2824 మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేశారు. అంతేకాకుండా నాన్ అవైలబిలిటీ కింద జనన మరణాల ధృవీకరణ పత్రాల జారీ సంబంధించి తెల్ల కాగితాలను పెట్టినా అధికారులు యధేచ్ఛగా సర్టిపికెట్లను జారీ చేశారు.

నాన్ అవైలబిలిటీ కింద 27,328 జనన, 4,126 మరణ ధృవీకరణ పత్రాలను 21 నెలల కాలంలో అధికారులు జారీ చేశారు. ఇందులో జనన ధృవీకరణకు సంబంధించి అత్యధికంగా మెహదిపట్నం 5877, చార్మినార్ 3949, బేగంపేట్ 2821, సికింద్రాబాద్ 1758 సర్టిఫికెట్లను జారీ చేశారు. అదేవిధంగా మరణాల ధృవీకరణకు సంబంధించి 4126 సర్టిఫికెట్లు జారీ చేయగా ఇందులో గోషామహల్‌లో 329, బేగంపేట్ సర్కిల్‌లో 409, రాజేంద్రనగర్ , మెహిదీపట్నం సర్కిళ్లలో 240 చొప్పున కార్వాన్, చార్మినార్, ఫలక్ నుమా సర్కిళ్లలో 220 చొప్పున సర్టిఫికెట్లను జారీ చేశారు.

కేవలం ఆధార పత్రాల కింద తెల్లకాగితాలే ఆధార పత్రాలుగా అధికారులు ఏకంగా 10,276 జనన, 1218 మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేసినట్లు సమాచారం. బేగంపేట్ సర్కిల్ 2787, సికింద్రాబాద్1702, చార్మినార్1405, మెహిదిపట్నం 1256, ఫలక్‌నుమా సర్కిల్‌లో 1146 జనన ధృవీకరణ పత్రాలను జారీ చేయగా, మరణాలకు సంబంధించి బేగంపేట్‌లో 369, సికింద్రాబాద్‌లో 159, గోషామహల్‌లో 124 ధృవీకరణ పత్రాలను కేవలం తెల్ల కాగితాల ఆధారంగానే జిహెచ్‌ఎంసి అధికారులు జారీ చేశారు.

వెనుక ఎంఐఎం కుట్ర!

కాగా, నకిలీ బర్త్ సర్టిఫికేట్ల వెనుక  ఎంఐఎం కుట్ర దాగి ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. పాతబస్తీలోని ఎక్కువగా బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయని చెబుతూ ఇందులో ఉగ్రవాదులు కూడా ఉండొచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు
 
“మున్సిపల్ అధికారుల సంతకం లేకుండా ఒక్క బర్త్ సర్టిఫికెట్ కూడా తయారు కాదు. అలాంటిది 27 వేల నకిలీ బర్త్ సర్టిఫికేట్లు పాతబస్తీలో వెలుగు చూశాయి. దీని వెనుక ఎంఐఎం వాళ్లు ఉండి అక్రమంగా బర్త్ సర్టిఫికేట్లు తయారు చేయించారు. ఇందులో ఎంత మంది పాకిస్థానీలు ఉన్నరు? ఎంత మంది బంగ్లాదేశీలు ఉన్నరు? హైదరాబాద్‌ను ఎంత మంది తుంగవాదులు అడ్డగా మార్చుకున్నారో? తేలాలి. ఈ కుట్రపై సీబీఐ ఎంక్వైరీ చేయాలి” అని డిమాండ్ చేశారు.
 
 ఈ 27 వేల నకిలీ సర్టిఫికేట్లు కాకుండా ఇంకా ఎన్ని అక్రమ రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఉన్నాయో తేలాలి. వీటన్నింటిపై సీబీఐ దర్యాప్తు జరపాలని స్పష్టం చేశారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కూడా డిమాండ్ చేశారు.  హైదరాబాద్‌ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అంటూ ఫేక్‌ సర్టిఫికెట్లతో ఇక్కడ నివాసం ఉంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అసమర్ధతకు ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు.