కేంద్ర పథకాల అమలుకు సహకరించని కేసీఆర్

కేంద్ర పథకాల అమలుకు కేసీఆర్ ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. అందుకనే కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు బిఆర్ఎస్ నేతలకు లేదని స్పష్టం చేశారు.   కేంద్రం ఏం అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన విమర్శించారు.  ట్రైబల్ యూనివర్శిటీ డీపీఆర్  కోసం కేంద్రం కోటి రూపాయలు ఇచ్చిందని  కానీ..  రాష్ట్ర ప్రభుత్వం  స్థలం కూడా కేటాయించడం లేదని ఆరోపించారు. 

హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు కేంద్రం రూ.1,250 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో డీపీఆర్‌ మంజూరైందని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎల్‌అండ్‌టీ మధ్య ఒప్పందం జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైళ్ల పొడిగింపును అడ్డుకుంటోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
 
మెట్రో వాస్తవానికి పలక్ నుమా వరకు రావాలని, కానీ అఫ్జల్ గంజ్ వద్దే ఆపారని, పాతబస్తీకి మెట్రో రాకుండా అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఎంఐఎం నేతల ఆస్తుల కోసమే ఫలక్ నుమా మెట్రోను అడ్డుకున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ అబద్దాలకు మారుపేరని, మసిపూసి మారేడుకాయ చేస్తారని విమర్శించారు.

ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటి వరకు భూమి ఇవ్వలేదని కిషన్ రెడ్డి వెల్లడించారు.  అలాగే సైనిక స్కూల్, సైన్స్ సిటీ కోసం కూడా భూములు కేటాయింపలేదని చెప్పారు. ఘట్ కేసర్, యాదాద్రి ఎంఎంటీ కోసం భూములివ్వడం లేదని ఆరోపించారు.  రామగుండం, బీహెచ్ఈఎల్, శంషాబాద్ లో ఈఎస్ఐ ఆస్పత్రులు నిర్మిస్తామని పదే పదే లేఖ రాసినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని వెల్లడించారు.

దళిత విద్యార్థుల జాబితాను పంపించమంటే కాలయాపన చేస్తోందని, ఈ సంవత్సరం వారికి రావల్సిన ఉపకార వేతనాలను అందకుండా చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు ఇదే ప్రభుత్వం కొనసాగితే నష్టం జరుగుతుందనే విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలని కోరారు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని కేంద్ర మంత్రి మండిపడ్డారు.