నాగాలాండ్‌లో ప్రతిపక్షమే లేని ప్రభుత్వం

అత్యధిక రాజకీయ పార్టీలు కలిగిన నాగాలాండ్‌లో అసలు ప్రతిపక్షమే లేని ప్రభుత్వం ఏర్పాటు కానుంది. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమికే అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలో మరోసారి ప్రతిపక్షమే లేని ప్రభుత్వం ఏర్పడనుంది.
 
60మంది సభ్యులున్న నాగాలాండ్‌ అసెంబ్లీకి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. మార్చి 2న ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో ఎన్నికల ముందే జట్టుకట్టిన అధికార ఎన్డీపీపీ 25, బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో 37 మంది ఎమ్మెల్యేలతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే బంలం సంపాదించాయి.
 
ఇక 7 స్థానాలు గెలిచిన ఎన్సీపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అదేవిధంగా ఎన్‌పీపీ 5, ఎల్‌జేపీ 2, ఎన్‌పీఎఫ్‌, ఆర్‌పీఐ 2 చొప్పున, జేడీయూ 1, నలుగురు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. అయితే ఎల్‌జేపీ, ఆర్‌పీఐ, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇప్పటికే అధికార కూటమికి తమ మద్దతు ప్రకటించారు.
 
తాజాగా ఎన్సీపీ, ఎన్‌పీఎఫ్‌ కూడా నిపియు రియో నేతృత్వంలోని ఎన్‌డీపీపీతో చేతులు కలిపాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అధికార కూటమిలో చేరడంతో అసెంబ్లీలో ప్రతిపక్షమే అనేది లేకుండా పోయింది. గతంలో కూడా ఇలానే జరిగింది. 2015, 2021లో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అధికార పార్టీకి మద్దతు ప్రకటించాయి.కాగా, ఈ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించిన ఎన్‌డీపీపీ అధినేత నిఫియు రియో ఐదోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. దీంతో రాష్ట్రాన్ని సుదీర్ఘకాలంగా పాలించిన ముఖ్యమంత్రిగానూ రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు సీఎంగా కొనసాగిన నేతగా ఎస్‌సీ జమీర్‌ నిలిచారు.

నవంబర్ 11, 1950న అంగామి నాగ కుటుంబంలో జన్మించిన రియో  కొహిమాలోని బాప్టిస్ట్ ఇంగ్లీష్ స్కూల్‌లో, తర్వాత పురూలియాలోని సైనిక్ స్కూల్‌లో చదువుకున్నారు. తర్వాత అతను డార్జిలింగ్‌లోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో చదువుకొని కోహిమా ఆర్ట్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి నాగాలాండ్‌కు తిరిగి వచ్చాడు.

పాఠశాల, కళాశాల రోజుల్లో చురుకైన విద్యార్థి నాయకుడుగా రియో చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1974లో కోహిమా జిల్లాలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యువజన విభాగానికి అధ్యక్షుడిగా దాదాపు ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత నాగాలాండ్ అధ్యక్షుడయ్యాడు.

ఇప్పటివరకు పోటీ చేసిన ఎనిమిది రాష్ట్రాల ఎన్నికలలో, రియో 1987లో మొదటి ఎన్నికల్లో మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.  రెండు సంవత్సరాల తర్వాత 1989లో కాంగ్రెస్ టిక్కెట్‌పై చేసిన రెండవ ప్రయత్నంతో ఆయన రాజకీయ జీవితం ఊపందుకుంది. రియో 2002 వరకు హోం మంత్రిగా సహా వివిధ హోదాల్లో నాగాలాండ్‌కు సేవలందించారు.

ఆ సంవత్సరం కాంగ్రెస్ నుండి వైదొలిగి నాగా పీపుల్స్ ఫ్రంట్  కాక్ గుర్తును పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. రియో 2003లో మొదటిసారిగా అత్యున్నత పదవిని చేపట్టేందుకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ సి జమీర్‌ను పదవీచ్యుతులు కావించారు.  జనవరి 2008లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడినప్పుడు ఆయనను ముఖ్యమంత్రిగా తొలగింఛారు.

 రెండు నెలల తర్వాత జరిగిన ఎన్నికలలో, అతని పార్టీ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది.  రియోను ఎన్ పి ఎఫ్ నేతృత్వంలోని డెమోక్రటిక్ అలయన్స్ ఆఫ్ నాగాలాండ్ నాయకుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు. 2013లో జరిగిన తదుపరి ఎన్నికలలో,  ఎన్ పి ఎఫ్ భారీ మెజారిటీని పొందడంతో రియో మూడవసారి ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు.

2014 వరకు ఆ పదవిలో కొనసాగి ఎంపీ కావడం కోసం ఆ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. నాగా శాంతి చర్చలకు సత్వర పరిష్కారం కోసం కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు తన ప్రజల గొంతుకగా ఉండాలనే “అవసరం” నుండి జాతీయ రాజకీయాల్లో చేరాలనే తన కోరిక ఉద్భవించిందని ఆయన  చెప్పేవారు.