తండ్రే లైంగికంగా వేధించేవాడు.. ఖుష్బూ

మహిళలు అత్యధికంగా లైంగిక వేధింపులను తమ కుటుంభం సభ్యులు, సన్నిహితులు, కలిసి పనిచేసేవారు. బాగా తెలిసిన వారి నుండే ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. చివరకు తండ్రులు, సోదరులు సహితం ఆ విధంగా వేధిస్తున్నట్లు ఇటీవల కాలంలో పలు సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
 
తాజాగా, రాజకీయ నాయకురాలిగా మారిన ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ తన చిన్నతనంలో తన తండ్రే తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. గతవారమే, జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమె ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన చేదు అనుభవం గురించి వివరించారు.
 
 “చిన్నతనంలో ఎప్పుడైనా లైంగిక వేధింపులకు గురైతే ఆ పసివారికి జీవితాంతం భయం భయంగా ఉంటుంది. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా జీవితాంతం గుర్తుండి పోతుంది. మా అమ్మ వివాహ బంధం కూడా అత్యంత వేధనతో కూడుకుని ఉంది” అని ఆమె చెప్పారు.

“ఆ మనిషి (ఖుష్బూ తండ్రి) భార్యను, పిల్లలను కొట్టడం, కొట్టడం తన జన్మ హక్కులా ఫీలయ్యేవాడు. పిల్లలను హింసించేవాడు, తన సొంత కూతురినే లైంగికంగా వేధించేవాడు. 8 ఏళ్ల వయస్సు నుంచే నాపై అతడి లైంగిక వేధింపులు మొదలయ్యాయి. నాకు 15 ఏళ్లప్పుడు ఆ దాష్టికం గురించి బయటకు చెప్పే ధైర్యమొచ్చింది.” అని ఖుష్బూ తన వేధనను తెలియజేశారు.

చిన్నతనంలో తనపై జరుగుతున్న అకృత్యాన్ని చెప్పుకునేందుకు ధైర్యముండేది కాదని, చాలా ఏళ్ల పాటు మౌనంగా ఉన్నానని ఖుష్బూ పేర్కొన్నారు. “నన్ను అన్నింటికంటే ఓ భయం ఎక్కువగా కలచి వేసేది. నేను చెప్పే విషయాన్ని మా అమ్మ నమ్మదేమోనని చాలా బాధపడేదాన్ని. ఎందుకంటే ఆమె.. తన భర్తే తనకు ప్రత్యక్ష దైవం అనే భావాన్ని కలిగి ఉండేది. అందుకే ఎవరికీ చెప్పేదాన్ని కాదు. కానీ 15 ఏళ్ల వయస్సులో బాధను భరించలేక అతడిపై తిరగబడ్డాను”.

“నాకు 16 ఏళ్లు కూడా రాకముందే అతడు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పుడు మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే రేపటి భోజనం ఎక్కడ నుంచి వస్తుందో కూడా మాకు తెలియదు. అప్పుడే ధైర్యం కూడగట్టుకుని జీవితంలో పోరాడటం నేర్చుకున్నాను.” అని ఖుష్బూ తెలియజేశారు. మహిళలు సమస్యలు వచ్చినప్పుడు, లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ధైర్యంగా పోరాడాలని సూచించారు.

జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఖుష్బూ తెలుగులో కలియుగ పాండవుల సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత కోలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తమిళనాట ఆమెకు గుడి కూడా కట్టారంటే అక్కడ ఎంత పాపులర్ హీరోయిన్‌గా మారిందో తెలుసుకోవచ్చు.
 
2010లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఖుష్బూ.. డీఎంకే, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు.