జైపూర్ లో పుల్వామా అమర జవాన్ల భార్యలకు అవమానం

పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ అమర జవాన్ల భార్యలకు అవమానం ఎదురైంది. తమకు న్యాయం చేయాలని కోరుతూ జైపూర్‌ లోని సాహిద్ స్మారకం వద్ద ధర్మాకు దిగిన ముగ్గురు సీఎఆర్‌పీఎఫ్ అమర జవాన్ల భార్యల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.

రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్  ప్రభుత్వం ఇంతగా తమను అవమానించడం భరించలేకపోతున్నామని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమకు న్యాయం చేస్తామని మాటిచ్చి నిలబెట్టుకోలేదని వాపోయారు. కారణ్య మరణాలకు అనుతించాలని కోరుతూ బాధితులు గవర్నర్‌కు మెమొరాండం సమర్పించారు.

రాష్ట్ర ప్రభుత్వం తమ గోడును పట్టించుకోకపోవడమే కాకుండా పోలీసు బలగాలతో తమను చెదరగొట్టారని పుల్వామా అమరవీరుడు రోహితేష్ లంబా భార్య మంజు లంబా (23) వాపోయింది. సీఎంకు తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లే ప్రయత్నం చేసినా తమను ప్టటించుకోలేదని, ఆ మాత్రం సమయం కూడా ఆయనకు లేదా అని మంజు లంబా ప్రశ్నించారు.

పోలీసు అధికారులు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా తమ పట్ల కరకుగా వ్యవహరించారని ఆమె వాపోయింది. ”మేము ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మా పట్ల ఇంత అమర్యాదగా ప్రవర్తించడం ఇది మొదటిసారి కూడా కాదు” అని ఆమె పేర్కొన్నారు.

 తప పట్ల దురుసుగా ప్రవర్తించిన రాజస్థాన్‌ పోలీసులపై ముఖ్యమంత్రి చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాజస్థాన్ పోలీసు అధికారులు పుల్వామా అమరవీరుల భార్యలను ఈడ్చుకు వెళ్తున్న ఫోటులు కూడా వెలుగు చూశాయి. మరోవైపు, అమరవీరుల భార్యలకు న్యాయం చేయాలని కోరుతూ వారికి మద్దతుగా బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా జైపూర్‌లో నిరసన చేపట్టారు.

రాజస్థాన్ ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదంటూ పుల్వామా అమరవీరుల భార్యలు ముగ్గురూ రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్‌ మిశ్రాను కలుసుకున్నారు. తమను కారుణ్య మరణాలకు అనుమతించాలని కోరుతూ ఒక విజ్ఞాపన పత్రాన్ని ఆయనకు అందజేశారు.
 
“నా భర్త అమరుడు అయినప్పుడు, మమ్మల్ని సందర్శించిన మంత్రులు, మీడియా, అందరూ అతనిని ప్రశంసించడం చూశాము. దేశం కోసం పోరాడేందుకు మా పిల్లలను కూడా పంపుదాం అనుకున్నాం. కానీ ముకుళిత హస్తాలతో, మేము మా పిల్లలను పంపబోమని చెబుతున్నాము…ఆజ్ కోయి సాథ్ నహిన్ హై హమారే (ఈరోజు మాతో ఎవరూ లేరు). ప్రభుత్వం మా మాట వినదు, బదులుగా మమ్మల్ని చెదరగొట్టడానికి పోలీసులను ఉపయోగిస్తుంది. మా గొంతు విననప్పుడు మమ్మల్ని ఎందుకు వీరపత్ని అంటారు?’’ అని మంజు ప్రశ్నించింది.
 
కోటా, భరత్‌పూర్ జిల్లాల నుండి పుల్వామా దాడిలో మరణించిన రాజస్థాన్‌కు చెందిన ఇతర ఇద్దరు జవాన్లు హేమ్‌రాజ్ మీనా, జీత్ రామ్ గుర్జార్‌ల భార్యలు మధుబాల మీనా మరియు, సుందరి గుర్జార్‌లతో కలిసి మంజు షాహిద్ స్మారక్ వద్ద ఆమె గురువారం ధర్నా చేశారు. ఉగ్రదాడి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వేరవేర్చాలని కోరారు.
 
“నా భర్త అంత్యక్రియల కోసం రాజస్థాన్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు మా గ్రామం గోవింద్‌పురా-బస్రీకి వచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నా భర్తకు గ్రామంలో స్మారక చిహ్నం నిర్మిస్తానని, మా బావ జీతేంద్ర లాంబాకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు” అని మంజు వాపోయారు.
 
 ‘‘సంగోడ్‌లోని అదాలత్‌ చౌరహాలో నా భర్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, మా గ్రామంలోని పాఠశాలకు ఆయన పేరు మారుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ నేటికీ ఆ హామీలు నెరవేరలేదు. ఇవేమీ పెద్ద డిమాండ్లు కావు. మమ్మల్ని గంటల తరబడి కూర్చోబెట్టే మంత్రులను కలిసేందుకు ప్రయత్నించాం” అని మధుబాల చెప్పారు.
 
జీత్ రామ్ గుర్జార్ భార్య సుందరి గుర్జార్ మాట్లాడుతూ, తన బావకు ప్రభుత్వ ఉద్యోగం, స్మారక చిహ్నం నిర్మించాలనే డిమాండ్‌తో భరత్‌పూర్‌లోని తన గ్రామం నుండి జైపూర్‌కు వచ్చానని చెప్పారు.