తెలంగాణలో ‘రథయాత్రల’కు బీజేపీ సన్నాహాలు

మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగవలసి ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రజలలోకి వెళ్లి తమ ప్రాబల్యం పెంచుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమంటూ సవాల్ విసురుతున్న బీజేపీ ఈ పర్యాయం ఏవిధంగానైనా తెలంగాణాలో అధికారంలోకి రావాలని పట్టుదలగా కసరత్తు చేస్తున్నది.
 
 కేసీఆర్ ప్రభుత్వంపై ముప్పేట దాడులతో ప్రజలలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఓ వైపు ప్రజాసంగ్రామయాత్రతో ప్రజల్లోకి వెళ్తూనే, తాజాగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తోంది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ  బీజేపీ నాయకత్వం  వ్యూహాం మార్చినట్లు తెలుస్తోంది. రథయాత్రల ద్వారా అన్ని నియోజకవర్గాలలో విస్తృతంగా జనంలోకి చొచ్చుకు వెళ్లే ఆలోచనలు చేస్తున్నారు.
 
ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాలలో బిజెపి రథయాత్రలను పెద్ద ఎత్తున జరుపుతూ వస్తుంది. గత వారమే ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో తెలంగాణ పార్టీ నేతలు జరిపిన భేటీలో అనుసరించవలసిన వ్యూహాల గురించి చర్చించినట్లు తెలుస్తున్నది. తెలంగాణాలో పార్టీ వ్యూహాలను అమిత్ షా స్వయంగా పర్యవేక్షింపనున్నట్లు చెబుతున్నారు.
 
కర్ణాటక ఎన్నికలు ముగిశాక అమిత్ షా పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టిపెట్టనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వ్యూహాల రూపకల్పన నుంచి క్షేత్రస్థాయి ప్రచారం దాకా ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. నేతల మధ్య సమన్వయలేమికి పరిష్కారం దిశగా కూడా చర్యలు తీసుకోవటంపై కూడా ఫోకస్ చేస్తారని భావిస్తున్నారు.
 
తెలంగాణాలో పార్టీ వర్గాలతో పాటు వివిధ వనరుల ద్వారా సేకరించిన సమాచారంతో జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ అందించిన నివేదికను ఆధారం చేసుకొని తెలంగాణాలో పార్టీ వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది.
 
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే ఐదు విడతలుగా జరిపిన ప్రజాసంగ్రామ యాత్రకు బ్రేక్ ఇచ్చి, అన్ని నియోజకవర్గాల్లో రథయాత్రలను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి అదరణ పెరుగుతున్న నేపథ్యంలో అవకాశాన్ని చేజార్చుకోవద్దనే భావనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
‘ప్రజాగోస – బీజేపీ భరోసా’ పేరుతో ఇటీవల తెలంగాణ బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ సభల్లో తెలంగాణకు కేంద్రం చేసిన అభివృద్ధి పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందనే అంశాలను ప్రజలకు వివరించారు. ఇక తాజాగా.. రథయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఏప్రిల్ తొలివారంలో ఈ యాత్రలకు శ్రీకారం చుట్టాలని బీజేపీ భావిస్తోంది.
 
రథయాత్రల కోసం ఐదు రథాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రతి పార్లమెంట్‌ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో రోజు యాత్ర చేపట్టేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్‌లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బండి సంజయ్ రథయాత్రలో పాల్గొనేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది.

మరోవంక, తెలంగాణాలో నలువైపులా కేంద్ర నాయకులతో భారీ బహిరంగసభలకు సన్నాహాలు చేస్తున్నారు. అమిత్ షా, జెపి నడ్డా వంటి సీనియర్ నేతలు ఈ బహిరంగసభలలో ప్రసంగిస్తారు. చివరిగా, సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.