అన్ని సంస్థలను అమ్మేయాలను కోవడం లేదు

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం ప్రైవేటీకరణ చేస్తోందని, వాటాలను అమ్మేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపారేసారు. అన్ని సంస్థలను అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం భావించడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రానికి తొందరేం లేదని పేర్కొన్నారు.
 
నాలుగు వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ ఉనికి తప్పకుండా ఉంటుందని సీతారామన్ తేల్చి  చెప్పారు. ఢిల్లీ వేదికగా జరిగిన రైసినా సదస్సులో ఆమె మాట్లాడుతూ టెలికం సహా నాలుగు వ్యూహాత్మక రంగాలలో ప్రభుత్వ ఆధీనంలోని కంపెనీలు ఉంటాయని తెలిపారు.  వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ రంగ వాణిజ్య సంస్థల ఉనికి కచ్చితంగా ఉంటుందని, ప్రభుత్వ నియంత్రణ ఉండేలా కంపెనీ హోల్డింగ్స్ ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు.
 
పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ పాలసీ ప్రకారం, 1. అటామిక్ ఎనర్జీ, అంతరిక్షం, రక్షణ రంగం; 2. రవాణా, టెలికమ్యూనికేషన్స్; 3. పవర్, పెట్రోలియమ్, బొగ్గు, ఇతర ఖనిజాలు; 4. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్.. నాలుగు విస్తృత వ్యూహాత్మక రంగాలుగా ఉన్నాయి. అవసరమైన రంగాల్లో ప్రభుత్వ నియంత్రణలో ఉండే వాణిజ్య సంస్థలు ఉంటాయని నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు.
 
“అన్నింటినీ అమ్మేయాలనే తొందరలో ప్రభుత్వం లేదు. అలాగని పిన్‍ల నుంచి వ్యవసాయ రంగ ఉత్పత్తి సంస్థల వరకు అన్నింటిని ప్రభుత్వం నడుపుతుందని కూడా కాదు. ప్రభుత్వ ప్రమేయం ఎక్కడ అవసరం లేదో అక్కడ ఉండదు. అయితే, వ్యూహాత్మక ప్రయోజనాల కారణంగా ఎక్కడ ఉండాలో అక్కడ ప్రభుత్వం ఉంటుంది. ఉదాహరణకు టెలికం రంగం. టెలికంలో ప్రభుత్వం నడిపిస్తున్న ఓ కంపెనీ ఉంది. అది ప్రొఫెషనల్‍గా రన్ అవుతుంది” అని ఆర్థిక మంత్రి వివరణ ఇచ్చారు.

ప్రధాన వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు సొంతంగా నడిచేలా భారీగా ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒకవేళ చిన్న సంస్థలు ఉన్నా, మనుగడ సాగించలేవని అనుకున్నా వాటిని విలీనం చేయడమో, మరో అవకాశం ఇవ్వడమో చేస్తామని ఆమె చెప్పారు. దాని ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు బలపడతాయని, స్వయంగా నడిచేలా నిలదొక్కుకుంటాయని ఆర్థిక మంత్రి చెప్పారు.

టెలికం రంగంలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‍ను విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం బయటికి వస్తోంది. మరోవైపు, ఐడీబీఐ బ్యాంక్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్‍ఎండీసీ స్టీల్, బీఈఎంఎల్, హెచ్‍ఎల్ఎల్ లైఫ్‍కేర్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వైజాగ్ స్టీల్ సంస్థలను ప్రైవేటీకరణ చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది.

ఇప్పటికే వీటిలోని కొన్ని సంస్థల్లో డీఇన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను కేంద్రం మొదలుపెట్టింది. వచ్చే ఏడాది కల్లా రూ.51,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను అమ్మడం ద్వారా రూ.51,000 కోట్ల నిధులను సమీకరించనున్ననట్టు కేంద్ర బడ్జెట్లోనూ సీతారామన్ ప్రకటించారు.