తమిళనాడును గత 6 దశాబ్దాలుగా రెండు ద్రావిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలు మాత్రమే పాలిస్తున్నాయి. 1967లో అన్నాదురై నుంచి మొదలుకుని ప్రస్తుతం ఎంకే స్టాలిన్ వరకు ఈ రెండు పార్టీలే తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్ అయినా, గత 12 ఏళ్లుగా దేశంలో బీజేపీ శరవేగంగా విస్తరిస్తున్నా తమిళనాడులో మాత్రం ఆ రెండు పార్టీలు అడుగుపెట్టలేకపోయాయి.
అధికారంలో ఉన్న పార్టీకి కాంగ్రెస్ మద్దతు పలికినప్పటికీ సొంతంగా మాత్రం గెలవలేకపోయింది. దీంతో గత 60 ఏళ్లుగా తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు 2 ఏళ్ల ముందు తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన విజయ్ డీఎంకే, అన్నాడీఎంకేలను చిత్తు చేశారు. అధికార డీఎంకే కూటమి 74 స్థానాలకు పరిమితమయ్యింది. పోటీచేసిన రెండు స్థానాల్లో విజయ్ విజయం సాధించగా, కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం స్టాలిన్ పరాజయం పాలయ్యారు. డీఎంకే కూటమి 73 స్థానాలకు, ఏఐడీఎంకే కూటమి 53 స్థానాలకు పరిమితమయింది.
సామాజిక న్యాయం, సమసమాజ స్థాపన, ద్విభాషా విధానం (తమిళం, ఆంగ్లం) వంటి టీవీకే సిద్ధాంతాలు ద్రవిడ రాజకీయ ధోరణితో పోలికలను కలిగి ఉన్నప్పటికీ, ఏఐఏడీఎంకే, డీఎంకేలకు ఒక ద్రవిడేతర ప్రత్యామ్నాయంగా తన పార్టీని అందిస్తానని చెప్పి వాగ్దానం చేసిన విజయ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలిచే ఒక ద్రవిడేతర పార్టీకి ఉన్న భారీ శూన్యాన్ని సొమ్ము చేసుకొనే ప్రయత్నంలో ఈ విజయం సాధించారు.
మొట్టమొదటి ఎన్నికల్లోనే సింగిల్‌గా 108 సీట్లను కైవసం చేసుకొని ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి అతిస్వల్ప దూరంలో నిలిచింది. ఈ తరుణంలో మరో 10 నుంచి 12 సీట్లను కూడగట్టేందుకు ఇతర పార్టీల వైపు టీవీకే అధినేత విజయ్ చూస్తున్నారు. దీంతో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమని స్పష్టమవుతోంది.
కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతను వెల్లడి చేస్తుండగా, తమిళనాడులో దశాబ్దాలుగా ఆధిపత్యం వహిస్తున్న ద్రావిడ పార్టీలను ప్రజలు తిరస్కరించడం కన్పిస్తుంది. 75 ఏళ్ల డీఎంకే, 52 ఏళ్ల అన్నా డీఎంకే వంటి రెండు సంప్రదాయ పార్టీలను టీవీకే అతిపెద్ద ఓటు బ్యాంకు కైవసం చేసుకుని చిత్తు చిత్తుగా ఓడించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తన పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఈ క్రమంలోనే తమిళనాడులో కొనసాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని విజయ్ బద్దలు కొట్టారు.
దీంతో గత ఆరు దశాబ్దాలుగా తమిళనాడులో ద్రావిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్యే సాగుతున్న రాజకీయ ఆధిపత్యానికి విజయ్ చెక్ పెట్టినట్లు అయింది. గతంలో 2019, 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ గెలుపు ఖాయం అని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కూడా తేల్చి చెప్పినా ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి.
మరోవైపు 2016లో జయలలిత మరణం తర్వాత క్రమక్రమంగా బలహీనపడుతున్న అన్నాడీఎంకే మాత్రం ఈ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేసింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, పార్టీలో కీలక నేతలుగా ఉన్న కేఏ సెంగోట్టయన్, పన్నీర్ సెల్వం వంటి వారు రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి వెళ్లడం వంటి పరిణామాలు ఎడప్పాడి పళనిస్వామికి పెను సవాలుగా మారాయి.
అన్నాదురై, ఎంజీఆర్ వంటి దిగ్గజాల ఆశీస్సులు తనకు ఉన్నాయని పేర్కొంటూనే తమిళ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసి విజయం సాధించారు. 1967లో ఎం భక్తవత్సలం కాంగ్రెస్ పార్టీ తరఫున చివరిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్నాదురై డీఎంకే పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా గెలిచి తమిళనాట ద్రవిడ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు.
ఇక అన్నాదురై తర్వాత కరుణానిధి డీఎంకే పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే అప్పటివరకు డీఎంకేలో ఉన్న ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) విడిపోయి అన్నాడీఎంకే పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చారు. అనంతరం మళ్లీ కరుణానిధి, జయలలిత, పన్నీరు సెల్వం, పళనిస్వామి, ఎంకే స్టాలిన్ – గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలు (డీఎంకే, అన్నాడీఎంకే) మధ్యనే తమిళనాడు అధికార మార్పిడి జరిగింది.
ఈ క్రమంలోనే 1967 తర్వాత తొలిసారి ఇప్పుడు విజయ్ డీఎంకే, అన్నాడీఎంకేలకు అధికారాన్ని దూరం చేస్తూ టీవీకే పార్టీని గెలిపించారు.
ఈ ఎన్నికలు అన్నాడీఎంకే పార్టీకి కొంత కోలుకునే అవకాశాన్ని ఇవ్వగా, అధికార డీఎంకే పార్టీకి మాత్రం గట్టి ఎదురుదెబ్బగా మారాయి. గత 7 ఏళ్లలో వరుస విజయాలతో జోరు మీదున్న డీఎంకే పార్టీ ఈ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలోనే 1962లో కాంగ్రెస్ పార్టీ తర్వాత.. ఒక ద్రవిడయేతర పార్టీ లేదా ఒక కొత్త పార్టీ తమిళ రాజకీయాల్లో ఇంతటి ప్రభావం చూపడం ఇదే తొలిసారి కావడం విశేషం.

More Stories
2021లో బెంగాల్ లో హిందూ మహిళలపై భయంకర దాడులు మరవకండి
జలంధర్, అమృత్సర్ సైనిక కేంద్రాల వద్ద ప్రేలుళ్ళు!
కేరళ ఓటమితో దేశంలో అస్థిత్వ సంక్షోభంలో ‘లెఫ్ట్’!