ఫాక్స్‌కాన్‌ పెట్టుబడులతో లక్ష ఉద్యోగాల మాయాజాలం!

తమ పాలనలో తెలంగాణకు దేశ, విదేశాల నుండి పెట్టుబడుల వరద ప్రవహిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం తాజాగా తైవాన్ కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థ ఫాక్స్‌కాన్‌  భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నట్లు జరిపిన సంబరాలు రెండు రోజులకే ఆవిరిగా మారాయి.
 
ఫాక్స్‌కాన్‌  చైర్మన్ యంగ్ లియూ మార్చ్ 1న తన పుట్టినరోజున మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ ను కలిస్తే, ఆ సందర్భంగా పలువురు మంత్రుల సమక్షంలో పెట్టుబడులకు సంబంధించి భారీ ఒప్పందం కుదిరినట్టు ప్రచారం చేసుకున్నారు. అయితే, తెలివిగా ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టబోతున్నారో చెప్పలేదు గాని, వాటి వల్లన లక్ష మందికి పదేళ్లలో ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఘనంగా ప్రభుత్వం ప్రకటించింది.
 
అంతేకాదు, ఈ రంగంలో దేశం మొత్తం మీదనే ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాలలో అతిపెద్దదిగా అభివర్ణించింది.  ఈ ఒప్పందంను అనుసరించి ‘ఫాక్స్‌కాన్’ ఇబ్రహీంపట్నంలో  ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా వెల్లడించారు. సాధారణంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు చాలావరకు ఆటోమేటిక్ గా పనిచేస్తుంటాయి.
 
వాటిల్లో కొద్దిమంది నిపుణులకు మినహా వేలు, లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించడం సాధ్యం కాదు. అయితే కేసీఆర్ ప్రభుత్వ ప్రచారానికి అవధులు లేకుండా పోయింది. లక్ష మందికి ఉద్యోగావకాశాలు అనేసరికి చాలామంది ఔరా అనుకున్నారు. మరో కొద్దీ నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా యువతను ఆకట్టుకునేందుకు ఈ పరిశ్రమ అధికార పార్టీ ప్రచారంకు ఉపయోగపడుతుందని అందరూ అనుకున్నారు.
 
హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ప్లాంట్‌తో వచ్చే పదేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణలో తమ పెట్టుబడుల విషయంలో తాము ఆశావాహ దృక్పథంతో ఉన్నామని ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ పేర్కొన్నారని తెలిపింది.  అయితే, అదే రోజు సాయంత్రం టి-వర్క్స్‌ను ప్రారంభించిన యంగ్ లియూ పెట్టుబడులు, ఉపాధి అవకాశాల గురించి తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, పదేళ్లలో లక్ష మంఉద్యోగాలు కల్పిస్తున్నందుకు మంత్రి కేటీఆర్‌ సభికుల ముందు ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
 
తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ యాపిల్‌ ఫోన్ల తయారీదారుగా ఉంది. తమిళనాడులో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో 2019 నుంచి యాపిల్‌ ఫోన్లు తయారుచేస్తోంది. తమ కొత్త ఐఫోన్‌-14ను త్వరలో భారత్‌లోనే తయారు చేయనున్నట్టు యాపిల్‌ కంపెనీ గతంలో ప్రకటించింది.ఈ నేపథ్యంలో ఫాక్స్‌కాన్‌ పెట్టబోయే ప్లాంట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే, ఈ ప్రచారం ఆర్భాటం ఎక్కువ రోజులు కొనసాగలేదు. స్వయంగా ఆ కంపెనీయే మీడియాలో ఒక వివరణ ఇవ్వడంతో కేసీఆర్ పరువు గంగలో కలిసిన్నట్లయింది. భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి తమ చైర్మన్‌ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది.
 
పైగా, తాము పెట్టబోయే పెట్టుబడులు, వాటి వల్ల లభించే ఉద్యోగాల గురించి మీడియాలో వచ్చిన వార్తలు తాము చెప్పినవి కావని సహితం తేల్చిచెప్పింది. తమ చైర్మన్‌ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 4 వరకు భారత్‌లో పర్యటించారు కానీ కొత్త ఉద్యోగాలకు సంబంధించి తమ సంస్థ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.