దమ్ముంటే 24 గంటల్లో నన్ను అరెస్టు చేయి.. అన్నామళై

బీహార్ వలస కార్మికులపై దాడి వివాదం తమిళనాడులో రాజకీయ కలకలం రేపుతోంది. విద్వేష వ్యాప్తికి పాల్పడుతున్నారని తనపై ఆదివారం కేసు నమోదు చేయడం పట్ల తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై డీఎంకే ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు.
 
‘దమ్ముంటే 24 గంటల్లో నన్ను అరెస్టు చేసి చూడండి’ అని ఆయన డిఎంకె ప్రభుత్వానికి సవాలు విసిరారు. పైగా తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు (డిఎంకె ప్రభుత్వం) ప్రజాస్వామ్య గళాన్ని అణచివేయొచ్చని అనుకుంటున్నారా? తప్పుడు కేసులు బనాయిస్తారా? సామాన్య పౌరుడిగా నేను మీకు 24 గంటల సమయం ఇస్తున్నాను, వీలయితే అరెస్టు చేయండి’ అని సవాల్ చేస్తూ  అన్నామళై ట్వీట్ చేశాడు.
 
”ఉత్తరాది సోదరులపై ఏడు దశాబ్దాలుగా వారు చేస్తున్న ప్రచారాన్ని బహిర్గతం చేసినందుకే నాపై డీఎంకే ప్రభుత్వం కేసు పెట్టింది. ఆ విషయాన్ని నేను అర్ధం చేసుకోగలను. వారు ఏమి మాట్లాడారో ఆ వీడియోను మీ ముందుంచుతున్నాను. దానినే నేను నా ప్రెస్‌మీట్‌లో చెప్పాను” అంటూ తన ట్వీట్ కు ఓ వీడియోను కూడా జతచేశారు.
 
ఉద్దేశపూర్వకంగానే కొందరు తప్పుడు ప్రచారం సాగిస్తూ, నకిలీ వీడియోలు పోస్ట్ చేశారని తమిళనాడు పోలీసులు ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. అన్నామలైపై సీసీబీ సైబర్ క్రైమ్ డివిజన్ కేసు నమోదు చేసినట్టు చెన్నై పోలీసులు చెప్పారు. ఐపీసీ సెక్షన్ 153, 153ఏ(1), 505(1)(బి), 505(1)(సి) కింద ఈ కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
 
ఈ తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర సైబర్ క్రైమ్ డివిజన్ అతడిని హింసను రెచ్చగొడుతున్నందుకు, రెండు వర్గాల మధ్య చిచ్చు రేపుతున్నందుకు బుక్ చేసింది. తమిళనాడులో బీహార్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయన్న నేపథ్యంలో తమిళనాడులో పోలీసులు కార్యాచరణలోకి దిగారు.
 
ఇదిలావుండగా ఉత్తరాది వారికి వ్యతిరేకంగా ఏడు దశాబ్దాలుగా డిఎంకె చేస్తున్న ప్రచారం తన ట్వీట్‌కు ప్రతిగా పోలీసుల ప్రతిస్పందన ద్వారా వెలుగులోకి వచ్చిందని అన్నామలై పేర్కొన్నారు. ‘ఏడు దశాబ్దాల కాలంలో వారు(డిఎంకె) ఏమి మాట్లాడారో దానికి సంబంధించిన వీడియో నా దగ్గర ఉంది. నేను ఫాసిస్టు డిఎంకెను దమ్ముంటే నన్ను అరెస్టు చేయాల్సిందిగా సవాలు విసురుతున్నాను” అని అన్నామళై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు.
 
ఆయన ఇంకా ‘తమిళనాడులోని వలస కార్మికులపై తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అది నన్ను బాధిస్తోంది. తమిళులమైన మాకు ‘ప్రపంచం అంతా ఒక్కటే కుటుంబం’. మేము ఉత్తరాది వారిని వేరుగా చూడలేదు, వారిపై ద్వేషం లేదు’ అని ట్వీట్ చేశారు.
 
తమిళనాడు పోలీసులు అన్నామళై మీదనే కాకుండా ‘బిజెపి బీహార్’ అనే ట్విట్టర్ అకౌంట్ ఉన్న వ్యక్తిపై కూడా 153, 153ఎ(1), 505(1)బి, ఐపిసి 505(2) కింద కేసు రిజిష్టరు చేశారు. బిజెపి ప్రతినిధి ప్రశాంత్ ఉమ్రావ్, ఇద్దరు జర్నలిస్టులు సహా నలుగురిపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నందుకు కేసులు బుక్ చేశారు. ‘తమిళనాడులో బీహార్ వలస కార్మికులపై దాడులు అంటూ తప్పుడు వీడియోలను సర్యూలేట్ చేసిన వారిని వదిలిపెట్టం’ అని తమిళనాడు డిజిపి శైలేంద్ర బాబు పేర్కొన్నారు.
 
కాగా, వలస కార్మికులపై దాడుల ఆరోపణలకు సంబంధించి రాష్ట్ర పోలీసులు, తిరుప్పూరు జిల్లా అధికారులు ఆదివారంనాడు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. వాణిజ్య, వ్యాపార సంఘాల ప్రతినిధులు, వలస కార్మికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.