డాక్టర్ ప్రీతి మరణంలో 11 అనుమానాలు!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి మృతి సందర్భంగా అసలేంజరిగిందో ఇంకా అంతుబట్టడం లేదు. ఆమెను హత్య కావించి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అంటూ ఆమె కుటుంబ సభ్యులు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండగా పోలీసులు మాత్రం ఆత్మహత్యగానే చిత్రీకరిస్తున్నారు.

ప్రీతి ఇంజక్షన్ తీసుకున్నప్పటి నుంచి నిమ్స్ తరలించే వరకూ ఏమేం జరిగింది..? అనే విషయాలపై లంబాడీల ఐక్య వేదిక 11 ప్రశ్నలు లేవనెత్తుతోంది. పలు డిమాండ్స్‌ను కూడా ప్రభుత్వం ముందు ఉంచింది.
ప్రీతి అనుమానాస్పద మృతిపై బహుజన నాయకుల హైదరాబాద్ డిక్లరేషన్ రిలీజ్ చేసింది.

1. విధుల నిర్వహణలో ఉన్న ప్రీతి బాయి అపస్మారక స్థితిలో ఉండగా మొదట చూసిందెవరు..?

2. అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిబాయి చేయి ఎందుకు కమిలి పోయింది..?

3. ప్రీతి బాయి అపస్మార స్థితిలో ఉన్న సమయం నుండి ప్రీతి తండ్రికి ఫోన్ వచ్చే వరకు మధ్యల ఏం జరిగింది..? ప్రీతి అపస్మారక స్థితిలో ఉండగానే కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు..?

4. ఫింగర్ ప్రింట్ లాక్‌లో ఉన్న ప్రీతి మొబైల్ డాటాను డిలీట్, అలాగే వారి బ్యాచ్‌మెట్‌లతో చేసిన చాట్‌ను డిలీట్ చేసిందెవరు..?

5. ప్రీతి మొబైల్‌లో హిస్టరీ చూడాల్సిన అవసరం ఏం వచ్చింది..? హిస్టరీలో డ్రగ్ గురించి సెర్చ్ చేశారని ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి దాని మీదనే కేసును తప్పుదోవ ఎందుకు పట్టించారు..?

6. ప్రీతి తండ్రి రాక ముందే అన్ని డిపార్ట్‌మెంట్‌ల హెడ్‌లు అక్కడికి ఎందుకొచ్చారు..?

7. వరంగల్‌కు ప్రీతికి చేసిన చికిత్స ఏమిటి..?

8. మంచి చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకొని వచ్చిన వారు నిమ్స్‌లో ఎలాంటి చికిత్స చేశారు..?

9. సైఫ్‌తో పాటు ఈ కేసులో భాగస్వాములు అయిన వారి పేర్లు ఎందుకు చేర్చలేదు..?

10. డిపార్ట్‌మెంట్ హెడ్.. ప్రీతి బాయిని నాకు చెప్పకుండా దగ్గరికి పోతారా అని ఎందుకు బెదిరించారు..?

11. పోలీసు వ్యవస్థ ఈ కంప్లయింట్ రాగానే ఎందుకు నిర్లక్ష్యం వహించింది..? అని ఓ ప్రకటనలో లంబాడీల ఐక్య వేదిక ప్రశ్నించింది.

ఇవే డిమాండ్లు

1. సిట్టింగ్ జడ్జ్‌చే విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. కమిటీలో ఎస్టీ ఐపీఎస్, ఎస్సీ ఐపీఎస్, బీసీ ఐపీఎస్.. ఎస్టీ, ఎస్టీ, బీసీ డాక్టర్స్ ఉండాలి.

2. సైఫ్, మిత్ర బృందంను సస్పెండ్ చేయాలి.

3. డిపార్ట్‌మెంట్ హెడ్, ప్రిన్సిపాల్‌‌లను సర్వీస్ నుంచి తొలగించాలి.

4. సీఐ బోనాల కిషన్‌ను సర్వీస్ నుంచి తొలగించాలి

5. రూ. 50 లక్షల బాండ్‌ను పీజీ విద్యార్థులకు తక్షణమే రద్దు చేయాలి.

6. రూ. 5 కోట్లు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలి.

7. ప్రీతి బాయి కుటుంబానికి గ్రూప్-1 స్థాయి ఉద్యోగం కల్పించాలి.

8. ప్రీతి బాయి కుటుంబానికి 3 ఎకరాల భూమిని, ఇంటిని నిర్మించి ఇవ్వాలి.. అని లంబాడీల ఐక్య వేదిక డిమాండ్ చేస్తోంది.