హైదరాబాద్ నగరంలో భారీగా స్టెరాయిడ్స్ దందా

ఇప్పటివరకు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయంలో దేశంలోనే కీలక కేంద్రంగా గుర్తింపు పొందిన  హైదరాబాద్ నగరంలో భారీగా స్టెరాయిడ్స్ దందా నడుస్తున్నట్లు తాజాగా వెల్లడైంది. తక్కువ సమయంలోనే కండలు తిరిగిన శరీరాకృతిని నిర్మించడానికి స్టెరాయిడ్‌, హార్మోన్ ఇంజెక్షన్లు, టాబ్లెట్లను కొనుగోలు చేసి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్టు తెలిపారు.
 
నిందితుల నుంచి భారీ ఎత్తున ఇంజెక్షన్లు, టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అమీర్‌పేటకు చెందిన ఓం ప్రకాష్ (40) సప్లమెంటరీ ప్రోటీన్ వ్యాపారం చేస్తుండగా, సరోదే నరేష్ (38) వాటిని సరఫరా చేస్తున్నాడు. చాంద్రయాణ్ గుట్టకు చెందిన సయ్యద్ ఫరూక్ (27) జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. విశాఖపట్నానికి చెందిన అవినాష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 
విశాఖపట్నానికి చెందిన ఓం ప్రకాష్ ప్రస్తుతం సనత్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతను హైదరాబాదులోని కుకట్‌పల్లిలో గతంలో ఫ్రీ లాన్సింగ్ జిమ్ ట్రైనర్‌గా పని చేశాడు. అంతేకాకుండా ఇతను హైదరాబాదులోని అమీర్‌పేటలో మజిల్ హౌస్ న్యూట్రిషన్ సప్లమెంటరీ ప్రోటీన్ వ్యాపారాన్ని కూడా చేశాడు. అయితే వ్యాపారంలో వచ్చే డబ్బులు తన జల్సాలకు సరిపోవటం లేదని, సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.

 
ఇందుకోసం హార్మోన్ల ఇంజెక్షన్లు, టాబ్లెట్లకు మార్కెట్లో డిమాండ్ ఉందని తెలుసుకుని, వాటిని అవసరమైన కస్టమర్లకు ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అధిక ధరకు విక్రయించి సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడు ఓం ప్రకాష్ ఫార్మసీ వ్యాపారంలో ఉన్న విశాఖపట్నంకి చెందిన అవినాష్ అనే చిన్ననాటి స్నేహితున్ని కలిశాడు.
 
అందుకు అవినాష్ అంగీకరింటంతో.. ఈ ఇద్దరు కలిసి హార్మోన్స్ ఇంజెక్షన్లు, టాబ్లెట్లను అక్రమంగా సరఫరా చేసి అధిక మొత్తంలో లాభాలు పొందుతున్నారు  ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడు ఓం ప్రకాష్ నగరంలోని జిమ్ములకు సప్లమెంటరీ ప్రోటీన్లను పంపిణీ చేసే నరేశ్, బేగంబజార్‌లో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న సయ్యద్ ఫారుక్‌తో పరిచయం ఏర్పడింది.
 
ఈ పరిచయంలో ఓం ప్రకాష్ ఆ ఇద్దరితో ఇంజెక్షన్లు, టాబ్లెట్ల గురించి చర్చించాడు. ఆ ఇద్దరు కూడా అంగీకరించటంతో  సిటీలో అవసరమైన వినియోగదారులకు సరఫరా చేయడం ప్రారంభించారు. అయితే సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులతో కలిసి దాడులు చేశారు.